సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ విషయం కోలీవుడ్ లోనే కాదూ.. టాలీవుడ్ లో కూడా సంచలనం అయ్యింది. అయితే తన ఇంట్లో బంగారు ఆభరణాలు పోపడంపై పోలీసులకు ఆమె ఫిర్యాదునివ్వగా.. రంగంలోకి దిగిన పోలీసులు దొంగల్ని పట్టుకున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో దొంగలు పడిన విషయం సెన్సేషన్ క్రియేట్ చేసింది.. ఎప్పుడో లాకర్లో పెట్టిన వస్తువులు చోరీకి గురికావడంతో ఆందోళన చెందిన ఆమె తెయనాం పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో సుమారు 60 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, వ్రజాలు, వెండి వస్తువులు దొంగలు దోచుకెళ్లారని పేర్కొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటి దొంగల పనే అని తేల్చారు. ఎంతో నమ్మకంగా ఉంటూ ఆమె ఇంట్లో లేని సమయంలో వస్తువులు కాజేయడంతో పాటు వాటిని అమ్మేసి ఆస్తులు కూడా పోగు జేసుకున్నారు. విశ్వాస పాత్రులుగా నటిస్తూ తిన్నింటి వాసాలు లెక్కపెట్టారు. ఇప్పుడు కటకటాల పాలయ్యారు. ఇంతకూ ఆ దొంగతనానికి పాల్పడిందెవరంటే..
2019లో జరిగిన తన సోదరి సౌందర్య వివాహ వేడుకలో ఈ ఆభరణాలు ధరించినట్టు ఐశ్వర్య రజనీకాంత్ తెలిపారు. అప్పటి నుండి వాటిని లాకర్ లోనే ఉంచానని, బయటకు తీయలేదని తెలిపారు. అయితే తన ఇంట్లో పనిచేసే వాళ్లకు ఈ విషయం తెలుసనని, వాళ్లకు తన లాకర్ కీలు ఎక్కడ ఉంటాయో తెలుసునన్న అనుమానం వ్యక్తం చేశారు. పలుమార్లు తాను లేనప్పుడు ఆ ఇంట్లోకి వెళ్లినట్లు పలువురు చెప్పారని అనడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మొత్తం చోరీకి సూత్రధారులు ఆ ఇంట్లో పనిచేస్తున్న ఇద్దరు మహిళలని తేల్చారు. ఐశ్వర్య నివాసంలో 18 ఏళ్లుగా ఎంతో నమ్మకస్తురాలిగా పనిచేసిన మండవేలికి చెందిన ఈశ్వరితో పాటు మరో లక్ష్మి, డ్రైవర్ వెంకటేశ్ ఈ భారీ చోరీకి పాల్పడ్డారు.
వీరు మరో ముగ్గురి సాయంతో ఇవన్నీ చేశారు. దొంగలించిన ఆభరణాలను అమ్మి ఆ డబ్బుతో చెన్నైలో ఓ ఇల్లుతో పాటు పలు ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఐశ్వర్య ఇంట్లోని 100 సవర్ల బంగారం, 30 గ్రాముల వజ్రాభరణాలు, నాలుగు కిలోల వెండి వస్తువులుతో పాటు కొన్ని పత్రాలు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. వాటిలో్ రూ.నాలుగు లక్షల విలువైన డైమండ్ సెట్స్, పురాతన బంగారు ముక్కలు , నవరత్న సెట్స్ , గాజులు చోరీకి గురైనట్లు తేలింది. అంతేకాదు కొంతకాలంగా ఐశ్వర్య ఇంటిలోని విలువైన వస్తువులను కూడా వారు దొంగిలించినట్లుగా పోలీసులు విచారణలో గుర్తించారు. ఈ మేరకు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నమ్మకస్తులే నట్టేట ముంచి..డబ్బులు కొల్లగట్టడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.