ఆమె ఒక్కత్తే కూతురు కావటంతో తల్లిదండ్రులు ఎంతో అల్లారుముద్దుగా పెంచారు. కాలేజీ చదువుతున్న సమయంలో ఆమె నాగేశ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. పెద్దలను ఎదురించి మరీ అతడ్ని పెళ్లి చేసుకుంది. కానీ..
ప్రేమ, పెళ్లి.. ఈ రెండూ అవినాభావ సంబంధం ఉన్న వేరు వేరు దారులు.. ప్రేమకు పెళ్లి అవసరం లేదు.. కానీ, పెళ్లి తర్వాత ప్రేమ అవసరం. ఈ విషయం తెలియని చాలా ప్రేమ వివాహాలు దినదినగండం నూరేళ్ల అయుష్షులా సాగుతున్నాయి. ఇందుకు కారణం పెళ్లి తర్వాత ప్రేమ తగ్గిపోవటమే. ‘మన సొంతం కదా.. ఎక్కడికి పోతుందిలే’ అన్న భావన రాగానే ఎదుటి వ్యక్తి మీద ఓ చిన్నపాటి నిర్లక్ష్యం మొదలవుతుంది. ఇది అర్థం చేసుకోవటం చాలా కొద్ది మందికి మాత్రమే సాధ్యం అవుతుంది. కేవలం అర్థం చేసుకోవటమే కాదు.. తట్టుకోవటం కూడా అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యం అవుతుంది.
అలా కాకపోతే నిత్యం గొడవలు జరుగుతాయి. గొడవలు పెరిగితే విడాకులు.. లేకపోతే ఆత్మహత్యలు, హత్యలు జరుగుతూ ఉంటాయి. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోలేకపోవటానికి ఆకర్షణలతో మొదలైన ప్రేమలు కూడా ఓ కారణమే. తాజాగా, ఓ యువతి ప్రేమ పెళ్లి చేసుకున్న రెండేళ్లకే ప్రాణాలు తీసుకుంది. పెద్దలను ఎదురించి మరీ ప్రియుడిని పెళ్లాడిన ఆ యువతి అర్థాంతరంగా తనువు చాలించింది. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మేఘనది కర్ణాటకలోని దొడ్డాబళ్లాపూర్ తాలూకాలోని కల్లుంటే గ్రామం. ఒక్కత్తే కూతురు కావటంతో తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా పెంచారు.
ఆమె కోరినవన్నీ ఇస్తూ వచ్చారు. మేఘన కాలేజీ చదువుతున్న సమయంలో నాగేశ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. వీరి ప్రేమ విషయం మేఘన ఇంట్లో వారికి తెలిసింది. దీంతో ఇంట్లో వారు వేరే సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మేఘన, నాగేశ్‌లు ఇంట్లోంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరిదీ ఒకే కులం కావటంతో కొన్ని రోజులకు పెద్దలు కూడా వీరిని ఇంటికి ఆహ్వానించారు. ఇక, అప్పటినుంచి ఇద్దరూ ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఓ పాప పుట్టింది. రెండేళ్లు ఇట్టే గడిచిపోయాయి. రెండేళ్లు సంతోషంగా సాగిన వీరి కాపురంలో తర్వాతి నుంచి గొడవలు రావటం మొదలయ్యాయి.
నిత్యం భార్యాభర్తలు గొడవలు పడుతూ ఉన్నారు. శనివారం రాత్రి కూడా ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. మేఘన కోపంగా తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. అర్థరాత్రి గదిలో ఉన్న పాప ఏడుస్తుండటంతో నాగేశ్‌కు తలుపు బద్దలు కొట్టి చూశాడు. మేఘన చనిపోయి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అల్లుడి కారణంగానే తమ కూతురు చనిపోయిందని మేఘన తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరి, గొడవల కారణంగా ఆత్మహత్య చేసుకున్న మేఘన ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.