మెడికో విద్యార్ధి డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి సైఫ్ ఎట్టకేలకు ప్రీతిని ర్యాగింగ్ చేసినట్లు అంగీకరించాడు. ఇన్నాళ్లు నాకేం తెలియదంటూ మొండికేసిన సైఫ్.. వాట్సాప్ చాటింగ్ చూపించి విచారించడంతో నిజం ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థి ప్రీతి మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి సైఫ్ పోలీసుల కస్టడీలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తాను ప్రీతిని వేధించలేదని చెబుతూ వస్తోన్న సైఫ్.. తాజాగా ప్రీతిని ర్యాగింగ్ చేసినట్టు నేరాన్ని అంగీకరించారని వరంగల్ పోలీసులు తెలిపారు. కోర్టుకు సమర్పించిన కన్ఫెషన్ రిపోర్ట్‌లో పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు.
ఫిబ్రవరి 22న ప్రీతి ఆత్మహత్యకు పాల్పడటం.. ఆ తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించడం.. ఫిబ్రవరి 26న ఆమె మరణించడం తెలిసిందే. ఇది జరిగిన నాటి నుంచి ఆమె కుటుంబీకులు సైఫ్‌పైనే అనుమానాలు వ్యక్తం చేశారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని చెప్తూనే ఉన్నారు. చివరకు వారి అనుమానాలే నిజమయ్యాయి. ఉద్దేశపూర్వకంగానే ప్రీతిని ర్యాగింగ్ చేసినట్టు సైఫ్ పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. మొదటి నుంచి ప్రీతి కుటుంబీకులు అదే చెప్తున్నా.. సైఫ్ మాత్రం అలాంటిదేం లేదని కొట్టిపారేస్తూ వచ్చాడు. తాను సీనియర్ కనుక ప్రీతి వృత్తిరీత్యా తప్పు చేస్తే అది తప్పు అని చెప్పానే కానీ.. ర్యాగింగ్ చేయలేదని వాదిస్తూ వచ్చాడు. కానీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి.. వాట్సాప్ చాట్స్ బయటపెట్టడంతో ఎట్టకేలకు దిగొచ్చాడు. ఆధారాలన్నీ తనకు వ్యతిరేకంగా ఉండటంతో ఇక దాచి పెట్టలేననుకున్న సైఫ్.. తాను కావాలనే ప్రీతిని ర్యాగింగ్ చేసినట్లు ఒప్పుకున్నాడు.
సైఫ్ తన తప్పును అంగీకరించడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సైఫ్ కస్టడీ ముగిసిన తర్వాత మార్చి 6న అతడిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. దాదాపు నాలుగు రోజుల పాటు విచారణ జరిపిన పోలీసులు, పక్కా ఆధారాలతో అతని నుండి నిజాన్ని చెప్పించగలగారు. కాగా, మెడికో ప్రీతి మృతి కేసును సవాల్ గా తీసుకున్న వరంగల్ సీపీ రంగనాథ్ నేరుగా రంగంలోకి దిగారు. ఎంజీఎంలోని అనస్తీషియా విభాగం, ఆర్ఐసీయూ వార్డును దగ్గరుండి మరీ అడుగడుగునా పరిశీలించారు. అనస్తీసియా సీనియర్ విద్యార్థులు, ప్రీతి సహచరులను విచారించారు. అనంతరం ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ని కలిశారు.
మరోవైపు ప్రీతి మరణంపై ఆమె కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రీతిని సైఫ్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆమె తండ్రి నరేంద్ర ఆరోపించారు. ప్రీతి ఆత్మహత్య ఘటనలో ఎవరి ప్రమేయంలో ఉందో పోలీసులు తమకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో పారదర్శకంగా విచారణ జరిపి తన కూతురికి న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను కోరారు. కాగా,నిన్న ప్రీతి తల్లిదండ్రులను మంత్రి కేటీఆర్ కలిశారు. నిందితులు ఎవరైనా వదలొద్దని సీపీకి ఆదేశాలు జారీ చేశారు. ప్రీతి తల్లిదండ్రుల ఎదుటే సీపీతో కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపమ్లో తెలియజేయండి.