Disha Case: మూడేళ్ల క్రితం జరిగిన దిశ ఎన్‌కౌంటర్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దిశ కేసులో నిందితులైన ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. 2019 డిసెంబర్ 6వ తేదీ తెల్లవారు జామున ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. దేశం మొత్తం సీపీ సజ్జనార్‌ను, ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను పొగడ్తలతో ముంచెత్తింది. ముఖ్యంగా మహిళాలోకం ప్రశంసలతో వారిని ముంచెత్తింది. అయితే, ఈ ఎన్‌కౌంటర్ బూటకపు ఎన్‌కౌంటర్ అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.ఎస్.సిర్పూర్కార్ సారథ్యంలోని విచారణ కమిషన్‌ను తాజాగా తేల్చి చెప్పింది.
దిశ ఎన్‌కౌంటర్‌పై రెండేళ్ల పాటు దర్యాప్తు జరిపిన ఈ కమిషన్ తుది నివేదికను సుప్రీంకోర్టుకు అందజేసింది. దిశ ఎన్‌కౌంటర్‌ను బూటకంగా పేర్కొంది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను, ఎన్‌కౌంటర్‌ను సమర్థించటానికి ప్రయత్నించిన వారిపై హత్య కేసు నమోదు చేసి విచారించాలని తెలిపింది. ఈ నేపథ్యంలో దిశ కేసులో నిందితులైన ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవుల కుటుంబసభ్యులు మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా తమ వారిని పొట్టన పెట్టుకున్నారని కన్నీరుమున్నీరయ్యారు.చెన్నకేశవులు భార్య రేణుక మాట్లాడుతూ.. ‘‘ మేము ఎక్కడికిపోయినా మా గురించి మాట్లాడుతున్నారు. చెన్నకేశవులు భార్య, అట్ల చేశాడు, ఇట్ల చేశాడు అంటూ మాట్లాడుతుంటారు. చాలా బాధ అనిపిస్తుంది. మేము బయటకు వెళితే అందరూ చాలా ఘోరంగా చూస్తారు. మమ్మల్ని ఏదైనా చేస్తారేమోనన్న భయంతో బయటకు వెళ్లటం లేదు. ఊర్లోనే ఉంటాం. దిశ ఇంట్లో జరిగింది అదే ఘటన, మా ఇంట్లో జరిగింది అదే ఘటన. ఇంక మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. చిన్న వయసులోనే జీవితం మొత్తం ఖరాబు చేసుకున్నా.. నా బిడ్డ కోసం బతుకుతున్నా’’ అని అన్నారు.
మహ్మద్ ఆరిఫ్ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ‘‘ మా అబ్బాయి పేరు మహ్మద్ రఫి.. పోలీసులు మహ్మద్ ఆరిఫ్ అని పెట్టిర్రు. మేము ఇంటి లోపల కూర్చుంటుంటుమి.. మా బాబు తెచ్చేస్తుండే.. తిని ఊక కూసుంటుంటిమి. ఇప్పుడు మా పరిస్థితి.. ఎక్కడ కుక్కల బతుకైపోయింది. మా అబ్బాయి తప్పు చేస్తే చంపేయమని చెప్పాం.. కానీ, మా అబ్బాయి తప్పు చేయలేదు. ఇదంతా డూపు.. ఎనుక మేధావులుండరు, ముఠాలున్నరు’’ అని అన్నారు.జొల్లు నవీన్ తల్లి మాట్లాడుతూ.. ‘‘ ఎన్‌కౌంటర్ డూపు ఎన్‌కౌంటర్ అని తేలింది. అదే జైల్లో పెట్టుంటే డూప్ అని తెలిస్తే మా అబ్బాయి ఇంటికన్నా వస్తుండే.. అన్యాయంకి, కొండపోయిన 14 రోజులు, 15 రోజుల టైం ఇవ్వగానే.. 8 రోజులకే ఎన్‌కౌంటర్ చేసేసిర్రు. 14 రోజుల టైం కూడా పెట్టలేదు. వాళ్లు ఏం చెప్తారో తెలియనీక. వాళ్లు చేసిర్రా, వాళ్ల ఎనకాల ఎవరన్నా ఉండి చేపిచిన్రా అని తెలియనీక. న్యాయం, అన్యాయం ఏదీ తెలియకుండానే ఎన్‌కౌంటర్ చేసేసిర్రు’’ అని అన్నారు.
అయితే, జొల్లు శివ కుటుంబసభ్యుల పరిస్థితి దయనీయంగా ఉంది. కేసులో ఏం జరుగుతోందో కూడా వారికి తెలియదు. తమ లాయర్ వాటిని చూసుకుంటున్నాడని, మీడియా ద్వారా కొన్ని విషయాలు తెలుస్తున్నాయని అన్నారు. మరి, దిశ నిందితుల కుటుంబసభ్యుల ఆవేదనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Disha Encounter: దిశ ఎన్‌కౌంటర్ ఓ బూటకం.. ఆ 10 మంది పోలీసులపై హత్య కేసు పెట్టి విచారించాలి: కమిషన్