టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌తో ‘వారియర్’ సినిమా తీసిన ప్రముఖ దర్శకుడు లింగుసామి చిక్కుల్లో పడ్డారు. ఒక కేసులో ఆయనకు కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది.
కోలీవుడ్ స్టార్ దర్శకుల్లో లింగుసామి ఒకరు. తమిళంతో పాటు తెలుగులోనూ ఆయన తీసే సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. కోలీవుడ్‌లో ఆయన తెరకెక్కించిన ‘రన్’, ‘పందెంకోడి’, ‘ఆవారా’ చిత్రాలు తెలుగునాట సంచలన విజయాలు సాధించాయి. ఎన్నాళ్లుగానో టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్న లింగుసామి.. ఎట్టకేలకు గతేడాది ‘వారియర్’ మూవీతో తెలుగు ఆడియెన్స్‌ను పలకరించారు. స్టార్ హీరో రామ్ పోతినేని నటించిన ‘వారియర్’ ద్విభాషా చిత్రంగా రూపుదిద్దుకుంది. తెలుగు, తమిళంలో ఏకకాలంలో విడుదలైన ఈ మూవీ.. రెండుచోట్ల పరాజయం పాలైంది. ఇదిలా ఉంటే.. గతేడాది లింగుసామి, అతడి సోదరుడు సుభాష్ చంద్రబోస్‌పై రూ.1.03 కోట్ల చెక్ బైన్స్ కేసు ఫైల్ అయింది.
‘తిరుపతి బ్రదర్స్’ పేరిట ప్రొడక్షన్ హౌస్ నిర్వహిస్తున్న లింగుసామి, సుభాష్‌లు 2014లో పీవీపీ క్యాపిటల్ లిమిటెడ్ నుంచి పైన చెప్పిన మొత్తాన్ని రుణంగా తీసుకున్నారు. కానీ వారు తిరిగి ఇచ్చిన చెక్ బౌన్స్ అవ్వడంతో పీవీపీ వీరిపై కేసు నమోదు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో చెన్నై, సైదాపేటలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు లింగుసామికి చెక్ ఫ్రాడ్ కేసులో 6 నెలల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు గతేడాది ఆగస్టు 22న ఉత్తర్వులు జారీ చేయగా.. దీనిపై లింగుసామి తన అప్పీల్‌ను దాఖలు చేశారు. అయితే ఆయనకు సైదాపేట కోర్టు వేసిన శిక్షపై ఏప్రిల్ 12న విచారించిన మద్రాస్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు సమర్థించింది.
మద్రాస్ కోర్టు ఆ తీర్పును సమర్థించడంతో లింగుసామి 6 నెలల జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తీర్పు గురించి ట్విట్టర్లో షేర్ చేసిన లింగుసామి.. మరోసారి అప్పీల్‌కు వెళ్తానని వెల్లడించారు. ఇకపోతే, లింగుసామి ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఆయన నిర్మాణంలో రూపొందిన పలు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా నిరాశపర్చాయి. దీంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయట. ముఖ్యంగా ‘ఉత్తమ విలన్’ సినిమా చేయడం వల్ల ఆయన ప్రొడక్షన్ వెంచర్ పతనమైందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి.
Director Lingusamy to serve 6 months in jail in cheque fraud casehttps://t.co/yE6XQ4eGb1
— India Today Showbiz (@Showbiz_IT) April 13, 2023