ఈ రోజుల్లో కూడా స్నేహానికి ప్రాణాలు ఇచ్చే వాళ్లు ఉన్నారు. అదే సమయంలో మిత్రుత్వానికి అంతగా విలువ ఇవ్వని వాళ్లూ ఉన్నారు. ఫ్రెండ్ ప్రమాదంలో ఉన్నాడన్నా పట్టించుకోని వారూ ఉన్నారు. అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. చావుబతుకుల్లో ఉన్న స్నేహితుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లలేదు అతడి ఫ్రెండ్స్. దారుణమైన ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
స్నేహం అంటే ఒకరికి ఒకరు ప్రాణం ఇచ్చేంతగా ఉండాలి. అలాంటి మిత్రులు ఎందరో ఉన్నారు. కానీ అదే సమయంలో స్నేహానికి విలువ ఇవ్వని వారినీ చూస్తున్నాం. కొందరైతే స్నేహితులని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తిస్తుంటారు. దేశ రాజధాని ఢిల్లీలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ప్రాణాలు కోల్పోయిన స్నేహితుడ్ని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు కొందరు యువకులు. వివేక్ విహార్‌కు చెందిన నలుగురు యువకులు ఆటోలో వెళ్తుండగా ప్రమాదవశాత్తూ ఆ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. మిగతా ముగ్గురు మాత్రం క్షేమంగా బయటపడ్డారు. అయితే గాయాలైన యువకుడ్ని అతడి స్నేహితులు కనీసం ఆస్పత్రికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు మృతి చెందాడు. దీంతో అతడ్ని అదే ఆటోలో అక్కడ నుంచి తీసుకెళ్లి వివేక్ విహార్ ప్రాంతంలోని ఓ అండర్‌పాస్ వద్ద విసిరేశారు ఫ్రెండ్స్. ‘గాయపడిన యువకుడు మృతి చెందాడు.. ఆ తర్వాత అదే ఆటోలో ముగ్గురు స్నేహితులు అతడ్ని అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయితే, చావుబతుకుల మధ్య ఉన్న ఆ యువకుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి బదులుగా వివేక్ విహార్‌లోని అండర్‌పాస్ వద్ద పడేశారు’ అని ఒక పోలీస్ అధికారి తెలిపారు. ప్రమాదానికి గురైన ఆటో యజమాని నిందితుల్లో ఒకరు అని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ ప్రమాదం వెనుక కుట్రకోణం ఏమైనా దాగుందా? మిత్రులే అతడ్ని చంపేశారా అనేది ఇంకా తేలాల్సి ఉందన్నారు.