'మహిళలు స్నానం చేస్తుంటే బాత్రూంలోకి తొంగిచూడటం నేరం..' చూడండి. సమాజంలో కామాంధుల ఆగడాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో.. ఇది తప్పు అని హైకోర్టు చెప్పాల్సి వస్తోంది. మైనర్ బాలిక స్నానం చేస్తుంటే తొంగిచూసిన ఓ బడుద్ధాయి.. అలా చూడటం తప్పుకాదంటూ కోర్టును ఆశ్రయించాడు. ఇతగాడిని, ఇతని తరుపున వాదించిన లాయర్ వాదనలు చదివితే.. ఇలా కూడా వాదించొచ్చా..? అనిపించక మానదు.
దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు, అకృత్యాలకు అంతేలేదు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన కామాందుల ఆగడాలకు అదుపులేకుండా పోతోంది. మహిళ కనపడగానే చూపులతో కాల్చుకు తినేవారు కొందరైతే, ఆమెను ఎత్తుకెళ్ళి అనుభవించే వారు మరికొందరు. ఇవి చాలవన్నట్లు మహిళలు స్నానం చేస్తుంటే.. తొంగి చూసే నీచులు కొందరున్నారు. ఇలాంటి ఘటనలు అన్ని చోట్లా జరిగేవే. ఇలానే ఓ యువకుడు మైనర్ బాలిక స్నానం చేస్తుంటే తొంగిచూసాడు. ఈ ఘటనపై బాధిత బాలిక పోలీసులకు పిర్యాదు చేయగా, వారు అతన్ని అరెస్ట్ చేశారు.
ఇంతటితో ఆ యువకుడు ఊరుకున్నాడా! అంటే లేదు. ‘స్నానం చేస్తుంటే బాత్రూంలోకి తొంగిచూడటం తప్పెలా అవుతుందంటూ..?’ లాయర్ చేత హైకోర్టులో పిటిషన్ వేపించి వాదించేలా చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆ వివరాలు.. 2014లో సోనూ అనే యువకుడిపై ఓ మైనర్ బాలిక ఫిర్యాదు చేసింది. సోనూ తనను కామంతో చూసేవాడని, ఆమె స్నానానికి వెళ్లిన సమయంలో బాత్రూం బయట ఉండి లోపలికి తొంగి చూసేవాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు ఆ బాలికను అసభ్యకరమైన పదజాలంతో దూషించడం, సైగలు చేసేవాడని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారించగా నిజమని తేలడంతో అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు.
ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు సెక్షన్ 354సీ, పోక్సో చట్టంలోని సెక్షన్ 12 కింద సోనూ అలియాస్ బిల్లాను దోషిగా తేల్చింది. సదరు యువకుడు ఈ తీర్పును సవాల్ చేస్తూ సోనూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ‘స్నానం చేస్తుంటే తొంగిచూడటం నేరమెలా అవుతుందంటూ..’ వాదించేలా ఒక లాయర్ ను ఏర్పాటు చేసుకున్నాడు. అతని తరుపు లాయర్ కూడా అలానే వాదించాడు. బాత్రూంలో స్నానం చేసిన బాలిక.. అదే ఏ పబ్లిక్ ప్లేస్‌లోనో లేక పవిత్ర నదుల్లోనో , స్విమ్మింగ్ పూల్స్‌లోనో, సరస్సుల్లోనో స్నానం చేస్తుండగా చూస్తే అది నేరం అవుతుందా అంటూ వాదనలు వినిపించాడు.
కానీ, ఢిల్లీ హైకోర్టు వీరి వాదనలను తోసిపుచ్చింది. బాలిక ఒక బాత్రూంలో స్నానం చేస్తుండగా తొంగి చూడటం అనేది నేరమే అవుతుందని.. దాన్ని పవిత్ర స్నానాలతో పోల్చి చూడరాదని తేల్చి చెప్పింది. ఒకవేళ చిన్న కర్టన్ ఉన్నా సరే మహిళలు స్నానం చేస్తున్నప్పుడు తొంగి చూడటం నేరమే అవుతుందని జస్టిస్ శర్మ తీర్పిచ్చారు. ఈ కేసులో సోనూకు ఏడాది కఠిన జైలు శిక్షతో పాటురూ.20వేలు జరిమానా విధించింది కోర్టు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.