ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతితో పరిచయం.. ప్రేమ పెళ్లి ఓ యువకుడి కొంపముంచింది. పెళ్లి తర్వాత ఎంతో సంతోషంగా భార్యతో గడపాలన్న అతడి ఆశ ఆవిరైపోయింది. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య.. మహిళ కాదని, ఓ హిజ్రా అని తెలిసి అతడు అల్లాడిపోయాడు. ప్రస్తుతం ఆ హిజ్రా భార్య కారణంగానే నానా అవస్థలు పడుతున్నాడు. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరాఖండ్, హరిద్వార్ జిల్లా రైసీ చౌక్ గ్రామానికి చెందిన ఓ యువకుడికి కొన్ని ఏళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతి పరిచయమైంది.
ఆ పరిచయం కాస్తా కొద్దిరోజులకు ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే, ఇందుకు తమ పెద్దలు ఒప్పుకోరని, లేచిపోయి పెళ్లి చేసుకుందామని ఆ యువతి చెప్పింది. ఇందుకు ఆ యువకుడు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ ఓ గుళ్లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత అతడు తన భార్యను ఇంటికి తీసుకెళ్లాడు. శోభనం రోజున అతడికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. తను ఇన్నేళ్లు ఎంతో గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అమ్మాయి కాదని, హిజ్రా అని గుర్తించాడు. దీంతో అతడి బాధకు అంతులేకుండా పోయింది.
ఇక, ఆ యువకుడికి హిజ్రాతో కలిసి ఉండటం ఇష్టం లేకపోయింది. ఈ నేపథ్యంలోనే తనను విడిచిపెట్టి పొమ్మని ఆమెను అడిగాడు. అయితే, హిజ్రా మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. తనకు 5 లక్షల రూపాయలు ఇస్తేనే వెళతానని భీష్మించుకు కూర్చుంది. ఈ విషయం పోలీసుల దగ్గరకు కూడా వెళ్లింది. సదరు యువకుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే విచారణ జరుపుతామని, తప్పు చేసిన వారికి శిక్ష విధిస్తామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త రైసీ చౌక్ గ్రామంతో పాటు చుట్టు పక్కలి గ్రామాల్లో ఓ చర్చనీయాంశంగా మారింది. సదరు యువకుడి పరిస్థితికి అందరూ జాలి పడుతున్నారు.