సిటీలోని ఓ ఏరియాలో పాతబడిన వాటర్ ట్యాంక్ నీటినే నిత్యం తాగుతున్నారు అక్కడి వాసులు. అయితే అకస్మాత్తుగా ఆ వ్యాటర్ ట్యాంకులో కుళ్లిన స్థితిలో శవం బయట పడింది. ఈ విషయం తెలిసిన స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని ముషీరాబాద్ ఏరియాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ముషీరాబాద్ ఏరియాలోని రిసాలగడ్డ డ్రింకింగ్ వాటర్ ట్యాంక్‌లో కుళ్లిన శవాన్ని గుర్తించారు స్థానికులు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు.. ఆ నీటిలో దాదాపు 40 – 50 రోజులుగా శవం పడి ఉండొచ్చని అంచనా వేసినట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలియక స్థానికులు గత కొద్ది రోజులుగా కుళ్ళిన శవం ఉన్న ట్యాంక్ నీటినే తాగుతున్నారు. ముషీరాబాద్ చుట్టుపక్కల వారికి ఈ ట్యాంక్ నీరే సరఫరా అవుతుందని అంటున్నారు. శివస్థాన్ పూర్, ఎస్ఆర్కె నగర్, పద్మశాలి సంఘం, హరినగర్ కాలనీలకు ఈ ట్యాంకర్ నుంచే డ్రింకింగ్ వాటర్ సప్లై జరుగుతుంది.
ఎస్.ఆర్.కె.కాలనీవాసుల నీటి సౌలభ్యం కొరకు సొసైటీకి చెందిన 600 గజాల స్థలాన్ని వాటర్ ట్యాంక్ నిర్మాణానికి కేటాయించారు. చాలా ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వాటర్ ట్యాంక్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు చెబుతున్నారు. సుమారు నెలన్నరపైనే ఆ శవం ఆ నీటిలో నానుతోందని, ఆ నీటినే తాము తాగుతున్నామని స్థానికులు భయంతో చెప్పుకొస్తున్నారు. కొద్దిరోజుల నుండి నీటిలో వెంట్రుకలతో పాటు నానిన చిన్న చిన్న మాంసపు ముక్కలు వచ్చాయని బస్తీ వాసులు తెలిపినట్లు సమాచారం. పలుమార్లు దీనిపై కాలనీవాసులు కంప్లైంట్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ షాకింగ్ సంఘటన పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.