ఈ మద్య యువత ప్రేమ మైకంలో పడి కన్నవారిని కష్టాలపాలు చేస్తున్నారు. తమ బిడ్డల బంగారు భవిష్యత్ కోసం ప్రతిక్షణం ఆరాటపడే తల్లిదండ్రులకు కడుపు కోత మిగుల్చుతున్నారు. ఓ బాలిక సభ్యసమాజం తలదించుకునేలా ప్రియుడి మోజులో పడి కన్న తండ్రిని సుపారీ ఇచ్చి మరి చంపించింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని కుషాయిగూడలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పల్సం రామకృష్ణ (49) భార్య, కూతురుతో కాప్రాలో నివాసం ఉంటూ స్థానిక గ్యాస్ ఏజెన్సీలో ఉద్యోగం చేస్తున్నాడు.
జూలై 20న తలకు గాయంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి నుంచి మరో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇంట్లో జారిపడి తలకు గాయమైందని కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక మృతుడు రామకృష్ణ పోస్టుమార్టం నివేదికలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన గొంతు నులిమి, బలమైన గాయాలు ఒంటిపై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనుమానం వచ్చిన పోలీసులు మృతుడి భార్య, కుటుంబసభ్యులను విచారించగా దారుణమై నిజాలు బయటకు వచ్చాయి. తమ ప్రేమకు పదే పదే తండ్రి అడ్డు వస్తున్నాడని ఆయన అడ్డు తొలగించుకోవాలని బాలికను ప్రేరేపించాడు.
ఈ క్రమంలోనే ప్రియుడు భూపాల్ తన ఇద్దరు మిత్రులతో కలసి రామకృష్ణ హత్యకు ప్లాన్ వేశాడు. జూలై 19 సాయంత్రం మత్తుగోలీల పౌడర్‌ను బాలికకు అందజేశారు. ఆమె కోడి కూరలో మత్తు మందు కలిపింది. దీంతో తల్లిదండ్రులు నిద్రలోకి వెళ్లిపోయారు. తర్వాత భూపాల్ తన మిత్రులతో కలిసి అర్ధరాత్రి బాలిక ఇంటికి చేరుకొని హత్యచేశారు. అయితే కూతురి ప్రేమ విషయం బయటకు వస్తుందన్న ఆలోచనతో మృతుడి కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పకుండా దాచినట్లు పోలీసులు తెలిపారు. నేరం రుజువు కావడంతో కూతురు, ఆమె ప్రియుడు భూపాల్, గణేష్, ప్రశాంత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.