సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు అప్‌డేట్ అవుతున్నారు. జనాలు ఓ రకమైన నేరాల గురించి అవగాహన పెంచుకునేలోపే.. మరో రకమైన నేరాలకు తెర తీస్తున్నారు. తాజాగా మరో తరహా కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
ఆన్‌లైన్ పేమెంట్లు, షాపింగ్ పెరిగిన కొద్ది.. మోసాలు కూడా అదే రేంజ్‌లో పెరుగుతున్నాయి. ఇక సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నారు. ఎవరూ ఊహించని రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు. నిన్నటి వరకు ఓటీపీ స్కామ్ గురించి తెలుసుకున్నాం. డెలివరీ బాయ్ రూపంలో కేటుగాళ్లు.. ఎలా మోసాలకు పాల్పడుతున్నారో చూశాం. ఇక తాజాగా మరో రకమైన మోసం వెలుగులోకి వచ్చింది. జనాలను మోసం చేయడానికి సైబర్ మోసగాళ్లు ఎలాంటి మార్గం వదలిపెట్టడం లేదు. పోలీసులు సైబర్ నేరాల గురించి ఎంత అవగాహన కల్పించినా సరే.. ఏదో రకమైన మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకరకమైన నేరాల గురించి అవగాహన కల్పించేలోపే మరో రకమైన మోసాలకు తెర తీస్తున్నారు. తాజాగా ఈ తరహా మోసమే ఒకటి వెలుగులోకి వచ్చింది. కరెంట్ బిల్లు పేరు చెప్పి అకౌంట్ ఖాళీ చేశారు సైబర్ కేటుగాళ్లు. ఆ వివరాలు..
ఈ తరహా మోసం కామారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. కరెంట్ బిల్లు పేరిట ఓ వ్యక్తికి భారీగా టోకరా వేశారు సైబర్ నేరగాళ్లు. కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామస్తుడైన రాజేశ్వర్‌కు ఫోన్‌చేసిన సైబర్ కేటుగాళ్లు.. మూడు నెలల కరెంట్ బిల్లు పెండింగ్ ఉంది.. కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తాం అంటూ బెదిరించారు. ముందుగా ఎంతో కొంత పే చేస్తే.. కనెక్షన్ కట్ కాకుండా ఉంటుంది అని నమ్మబలికారు. సైబర్ కేటుగాళ్ల మాట నమ్మిన రాజేశ్వర్.. సరే అన్నాడు. దాంతో సైబర్ కేటుగాళ్లు రాజేశ్వర్ మొబైల్‌కి ఓ లింక్ పంపారు. వారి మాటలు నమ్మిన రాజేశ్వర్ లింక్ ఒపెన్ చేశాడు. అంతే..
రాజేశ్వర్ సైబర్ నేరగాళ్లు పంపిన లింక్ మీద క్లిక్ చేశాడు. వెంటనే అతడి అకౌంట్ నుంచి 49వేల రూపాయలు డెబిట్ అయినట్టు రాజేశ్వర్ మొబైల్‌కి మెసేజ్ ఇచ్చింది. వెంటనే రాజేశ్వర్.. తనకు కాల్ వచ్చిన నంబర్‌కు ఫోన్ చేశాడు. కానీ రెస్పాన్స్ లేదు. దాంతో, మోసపోయాయని గ్రహించిన బాధితుడు రాజేశ్వర్.. దేవునిపల్లి పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ఇది మరో తరహా కొత్త రకం మోసం. సాధారణంగా కరెంట్ బిల్లు కట్టకపోతే విద్యుత్ సిబ్బంది ఫోన్ చేసి బిల్లు కట్టమని అడగరు. వారు డైరెక్ట్‌గా ఇంటికే వచ్చి అడగడమో, లేదంటే స్థానిక లైన్‌మెనో వచ్చి బిల్లు కట్టమని అడగడం చేస్తాడు.
అలా కాకుండా కరెంట్ బిల్లు కట్టమని ఒకవేళ ఎవరైనా ఫోన్ చేశారంటే అది కచ్చితంగా మోసగాళ్లే అయ్యుంటారు. ఈ విషయం తెలియకపోతే సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోవడం పక్కా అంటున్నారు పోలీసులు. ఎవరైనా మీకు కాల్ చేసి కరెంట్ కట్టాలనో, లేదంటే ఆధార్ కార్డు లింక్ చేయాలి అని ఫోన్‌చేస్తే మాత్రం అనుమానించాల్సిందే అంటున్నారు పోలీసులు. అలా కాకుండా కేటుగాళ్ల మాటలు నమ్మి వాళ్ల ఉచ్చులోపడి ఏదైనా లింక్ మీద క్లిక్ చేశారో మీ అకౌంట్ ఖాళీ అవుతుంది అంటున్నారు పోలీసులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.