ఆడ పిల్ల పుట్టిందనే సంబరం కన్నా, అత్తారింటికి పంపాలన్నా ఆత్రుత తల్లిదండ్రుల్లో కనిపిస్తుంది. గుండెలపై ఎప్పటికైనా కుంపటిగా భావించి.. ఓ అయ్య చేతిలో పెడతారు. అందుకోసం కట్న, కానుకలు ఇస్తారు. కొన్నాళ్లు సజావుగా కాపురం సాగిపోయాక.. అసలు సమస్యలు మొదలవుతున్నాయి.
ఆడపిల్ల పుడితే అల్లారు ముందుగా పెంచుకున్న తల్లిదండ్రులు, పెళ్లీడు వచ్చాక.. తోడు వెతికి పెళ్లి చేస్తారు. అయితే పెళ్లి పేరుతో వరకట్నం, బంగారు ఆభరణాలు, సారె రూపంలో పెద్ద యెత్తున ఇంటి సామాగ్రి చేరుతాయి. కొన్నాళ్లు సజావుగా వీరి కాపురం సాగిపోతుంది. ఆ తర్వాత మరింత కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధించడం మొదలు పెడతారు. భర్త, అత్త, మామలు, ఆడపడుచులు సాధించుకు తింటారు. వారికి ఎదురు చెబితే ప్రాణాలు తీసేందుకైనా వెనుకాడరు. ఈ వరకట్న వేధింపులు ఎన్నాళ్లకు ఆగుతాయో తెలియదు కానీ.. అబలలు మాత్రం బలౌతూనే ఉన్నారు. తాజాగా ఓ మహిళ.. అందులోనూ ఉద్యోగిని ఈ అదనపు కట్నానికి బలైంది.
భర్త, అత్తమామలు, ఆడబిడ్డలు అదనపు కట్నం కోసం వేధించడంతో అసిస్టెంట్ బ్యాంకు మేనేజర్ జ్యోతి (31) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. గీసుకొండ ఇన్‌స్పెక్టర్ సట్ట రాజు తెలిపిన వివరాల ప్రకారం..భద్రాద్రి కొత్తగూడెం సుజాతనగర్ మండలంలోని లక్ష్మీదేవిపల్లికి చెందిన జ్యోతికి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం సూర్యతండాకు చెందిన వాంకుడోతు స్వామితో 2017లో వివాహం జరిగింది. జ్యోతి తల్లిదండ్రులు స్వామికి రూ.15 లక్షల కట్నంతో పాటు ఇతర లాంఛనాలతో ఘనంగా పెళ్లి జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులు. స్వామి రైల్వేలో కమర్షియల్ ఇన్‌స్పెక్టర్‌గా, జ్యోతి వరంగల్ నగరంలోని కాశిబుగ్గ ఇండియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం వీరు నగరంలోని శంభునిపేటలో సొంత ఇల్లు కట్టుకుని కాపురం ఉంటున్నారు.
సెలవులు, పండుగలు రావడంతో ఇటీవల స్వామి తన కుటుంబాన్ని తీసుకుని సూర్యతండాకు వచ్చిపోతున్నారు. జ్యోతి సూర్యతండాకు వచ్చిన ప్రతీసారి ఆమె అత్తామామలు అంబాలి, రాములు, ఆడబిడ్డలు శారద, జ్యోతి, విజ్జి, సునీత అదనపు కట్నం కోసం వేధించేవారు. ఈనెల 2న స్వామి, జ్యోతి తమ కుమారులను తీసుకుని గ్రామానికి వెళ్లగా.. మళ్లీ వేధించడంతో.. ఆమె పురుగుల మందు సేవించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను వరంగల్ నగరంలోని ఓప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె బుధవారం మృతి చెందింది. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు స్థానిక తహసీల్దార్ విశ్వనారాయణ శవ పంచనామా జరిపించగా మృతురాలి భర్త, అత్త, మామ, ఆడబిడ్డలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ సట్ల రాజు తెలిపారు.