భర్త రోజూ తప్పతాగి, ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. ఆమెను అనుమానంతో వేధించేవాడు. భార్యను కొట్టేవాడు, తిట్టేవాడు. అలా ఓ రోజు తాగి వచ్చి భార్యతో గొడవపడి నిద్ర పోయాడు. ఆ నిద్రలోనే కలవరించాడు. ఆ కలవరింత విన్న భార్య, అతడి అత్త తీవ్ర నిర్ణయం తీసుకున్నారు.
బాధ్యతగా వ్యవహరించాల్సిన భర్త తప్పతాగి భార్యను హింసిస్తున్నాడు. భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన భర్త.. రోజు ఫూటుగా మందు కొట్టి, ఇంటికి వచ్చి ఆమెతో గొడవ పడేవాడు. ప్రతి రోజూ పిల్లల ముందు తిట్టుకునే వారు. చివరకు ఆమెపై దాడి కూడా చేసేవాడు. విసిగిపోయిన భార్య తీవ్ర నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా ఆ తప్పును భర్తపై నెట్టేసేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వేధిస్తున్న భర్తను అడ్డు తొలగించేందుకు ఆమె పెద్ద కుట్రనే పన్నినట్లు తేలింది. దీనికి ఆమె తల్లి కూడా సహకరించింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
బాపట్లలోని వేటపాలెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చీరాల రూరల్ సీఐ మల్లిఖార్జున రావు తెలిపిన వివరాల ప్రకారం.. దేశాయిపేట పంచాయతీ అంబేద్కర్ నగర్‌లో సలగల అజయ్ బాబు, భార్య శోభారాణి వారి ఇద్దరి పిల్లలతో నివాసం ఉంటున్నారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భర్త రోజు మద్యం సేవించి భార్యతో గొడవపడేవాడు. అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు రావాలంటూ తల్లి చేకూరి నాగమ్మని ఈ నెల 13న తన ఇంటికి పిలిపించుకుంది. ఆ రోజు కూడా మద్యం తాగి వచ్చిన భర్త.. భార్యతో గొడవపడ్డాడు. భర్త నిద్రపోగా.. చంపేస్తానంటూ కలవరిస్తుండటంతో.. తనకు ప్రాణ హాని ఉందని భార్య భయపడింది. తనను చంపేస్తాడేమోనని భయంతో ఆమె ఓ కుట్రకు తెరలేపింది.
అజయ్ మంచంపై పడుకుని గాఢ నిద్రలో ఉండగా, ఇంటి ఆవరణలో ఉన్న ఇనుప రాడ్డును తీసుకొని భర్త ముఖంపై, నుదుటిపై ఇష్టం వచ్చినట్లు కొట్టింది భార్య. తల పగిలి తీవ్ర రక్త స్రావంతో పాటు ఎముకలు కూడా బయటకు వచ్చాయి. కొన ఊపిరితో కొట్టుకుంటున్న భర్త కదులుతుండటంతో గమనించిన భార్య, అత్త చేకూరి నాగమ్మ సహాయంతో చుడీదార్ ప్యాంటుకు ఉండే నాడాతో గొంతుకు బిగించి చంపివేశారు. భర్త చనిపోయాడని నిర్ధారించు కొన్న తరువాత శవాన్ని బయటకు ఉన్న బట్టలు ఉతికే బండపై పడేశారు. తప్పతాగి వచ్చి బండపై పడి భర్త చనిపోయాడని చెప్పే ప్రయత్నాలు చేశారు. ఇంట్లో పడిన రక్తపు మరకలను నీటితో కడిగి సాక్ష్యాలు లేకుండా చేసే ప్రయత్నం చేశారు.
అయితే మృతుడి సోదరుడికి అనుమానం వచ్చింది. వీరిద్దరూ తరచూ గొడవపడుతున్న విషయం విజయ్‌కు తెలుసు. అతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి తమదైన స్టైల్‌లో విచారణ మొదలు పెట్టారు. దీంతో నిందితులైన భార్య సలగల శోభారాణి, అత్త చేకూరి నాగమ్మని మంగళవారం అరెస్టు చేసి విచారించగా వారు హత్య చేసినట్లు ఒప్పకున్నారు. హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్, రక్తంతో ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకొని వారిని కోర్టులో హాజరు పర్చనున్నారు. హత్య కేసును ఐదు రోజుల్లో ఛేదించి నిందితులను కటకటాల వెనక్కు నెట్టిన సీఐ మల్లి కార్జునరావు, ఎస్సై జి. సురేస్‌ను ఎప్పీ వకుల్ జిందాల్, డీఎస్పీ శ్రీకాంత్ అభినందించారు.