పెళ్లి చేసి అత్తారింటికి పంపిన కుమార్తె నుండి.. ఏ నిమిషంలో ఎటువంటి కబురు వినాల్సి వస్తుందోనన్న భయంతోనే బతుకుతుంటారు తండ్రి. సంసారం సాఫీగా సాగిపోతే ఆనంద పడతాడు. అదే కుమార్తె
వరకట్న వేధింపులు దేశంలో ఆగడం లేదు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను లక్షలు కట్నం ఇచ్చి ముక్కుం మోహం తెలియని వ్యక్తికి పెళ్లి చేస్తారు తల్లిదండ్రులు. అత్తింట్లోకి కోటి ఆశలతో అడుగు పెట్టిన ఆడబిడ్డకు మరింత కట్నం కోసం వేధించడంతో పాటు నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటుందని తెలిసినా.. తన ఆర్థిక స్థోమతతో తల్లడిల్లితోన్న తండ్రి.. కుమార్తె నుండి ఏ నిమిషంలో ఎటువంటి కబురు వినాల్సి వస్తుందోనన్న భయంతోనే బతుకుతుంటారు. అటు పుట్టింటికి చెప్పలేక, అత్తింట్లో నరకయాతన తాళలేక కొంత మంది అబలలు మృత్యు ఒడికి చేరకుంటున్నారు. లేదంటే అత్తింటి వారే.. కోడల్ని కడతేరుస్తున్నారు. తాజాగా తెలంగాణలో ఓ యువతి అనుమానాస్పద రీతిలో మరణించింది. అయితే అల్లుడు చెప్పే కారణాలు మామకు అనుమానాలు తెప్పించాయి.
పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలంలోని సిద్దిపల్లె గ్రామ పంచాయితీ పరిధిలోని శాలపల్లె గ్రామానికి చెందిన బిల్లా మౌనిక అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఆమె మృతిపై మౌనిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. శాలపల్లెకు చెందిన బిల్లా హరీశ్‌కు మంథని మున్సిపాలిటీ పరిధిలోని పోచమ్మవాడ చెందిన ముడుతనపల్లి రాజయ్య కుమార్తె మౌనికతో వివాహం అయింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం రాజయ్య తమ్ముడు రవికి హరీశ్ ఫోన్ చేసి, ఇంట్లో పని చేస్తుండగా మౌనికను పాము కాటు వేసిందని చెప్పాడు. తాము సమీపంలోని వైద్యుని వద్దకు ప్రథమ చికిత్స చేయించామని, అక్కడి నుండి పెద్దపల్లికి తీసుకెళుతున్నామని చెప్పాడు.
మరికొద్ది సేపటికి మౌనిక పరిస్థితి విషమించిందని, కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని తెలిపాడు. తాను, తన భార్య రాధ కరీంనగర్‌కు వెళ్లేసరికే తమ కూతురు చనిపోయిందని మృతురాలి తండ్రి రాజయ్య చెప్పాడు. మౌనికను తమ అల్లుడు హరీశ్‌తోపాటు కుటుంబసభ్యులు వరకట్నం కోసం వేధింపులకు గురిచేసేవారని తెలిపాడు. తమ కూతురి మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై షేక్‌మస్తాన్ పేర్కొన్నారు. మృతురాలికి పాప, ఎనిమిది నెలల బాబు ఉన్నారు. అయితే ఈ కేసు ఏ కోణంలో మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి. కేరళలో కోడల్ని పాముతో కాటేయించి చంపేసింది అత్తింటి కుటుంబం. కొన్ని నెలలకు ఆ విషయం వెలుగులోకి వచ్చిన సంగతి విదితమే. అలానే ప్రియుడి కోసం ఓ కోడలు తన అత్తను పాముతో హత్య చేయించిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.