అప్పటి వరకు స్నేహితులుగా ఉన్న వారు.. తర్వాత బద్ధ శత్రువులుగా మారుతున్నారు. వంచించడం, మోసగించడం, అతడి భార్య, ప్రేయసిపై కన్నేయడం వంటివి స్నేహితుల మధ్య చిచ్చుకు కారణమౌతున్నాయి. తాజాగా భార్యపై కన్నేశాడని స్నేహితుడిని కడతేర్చాడు ఓ వ్యక్తి. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
ఇటీవల చోటుచేసుకుంటున్న దారుణాలు చూస్తుంటే అభద్రతా భావం కలుగుతోంది. ప్రేమ, వివాహేతర సంబంధాల కోసం భార్య భర్తను, భార్యను భర్త, ఎంతో ప్రాణంగా మెలిగిన స్నేహితుడ్ని పొట్టనబెట్టుకుంటున్నారు. ఏదో ఓ చోట ఇటువంటి మరణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అప్పటి వరకు స్నేహ గీతం ఆలపించిన వారు..అప్పటికప్పుడే నర రూప రాక్షసులుగా మారిపోతున్నారు. కారణాలేవైనా చెలిమిని పక్కన పెట్టి స్నేహితుడ్ని బలితీసుకుంటున్నారు. మొన్న హైదరాబాద్‌లో ఓ అమ్మాయి కోసం తన స్నేహితుడ్ని హత్య చేశాడో మరో స్నేహితుడు. ఇది ఎంతటి సంచలనం కలిగించిందో అందరికీ తెలుసు. తాజాగా తమిళనాడులో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. తెన్‌కాసి జిల్లా సెంకొట్టలో అప్పయ్యప్పన్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతడికి వివాహమైంది. అయితే కమాండ్ క్వార్టర్స్ సమీపంలో ఒంటరిగా జీవిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో కలిసి అయ్యప్పన్ పని చేస్తున్నాడు. ఇద్దరు కలిసి ఖాళీ సమయాల్లో మద్యం సేవించేవారు. అయితే అతడి భార్యపై అయ్యప్పన్ కన్నేశాడు. ఆమె స్నానం చేస్తుండగా పలుమార్లు చూసినట్లు భర్త దృష్టికి వచ్చింది. ఈ విషయం తెలిసిన ఆ వ్యక్తి అయ్యప్పన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడికి గట్టి బుద్ధి చెప్పాలని భావించి.. తన స్నేహితుల్లో కొందరికి ఈ విషయాన్ని చెప్పాడు. వీరు అయ్యప్పన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని పథకం వేశారు.
యథావిధిగా ఓ రోజు అయ్యప్పన్‌ను మద్యం సేవించేందుకు ఆహ్వానించారు. అయ్యప్పన్ మత్తులో ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అతడి తలపై కర్రతో కొట్టారు. తీవ్రగాయాలతో అయ్యప్పన్ అక్కడిక్కడే మృతి చెందారు. అనంతరం వీరు అక్కడి నుండి పరారయ్యారు. మరుసటి రోజు అయ్యప్పన్ మృతదేహాన్ని చూసిన కొందరు పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ఘటనపై విచారణ చేపట్టారు. అయితే విచారణలో అతడ్ని తాగేందుకు తీసుకు వచ్చిన వ్యక్తిని పోలీసులు విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భార్య స్నానం చేస్తుండగా అయ్యప్పన్ చూడటంతో నిందితుడు అతడిని హత్య చేసినట్లు స్నేహితుడు చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి…పరారీలో ఉన్న వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.