దేశం శాస్త్ర, సాంకేతికంగా ఎంత ముందుకు దూసుకెళుతున్నా, కుల రక్కసి వెనక్కు నెడుతోంది. తక్కువ కులానికి చెందిన వ్యక్తులను ప్రేమించినా, పెళ్లి చేసుకున్నా పెద్దలు సహించలేకపోతున్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక.. హత్యలకు పాల్పడుతున్నారు.
భారత్ తన హద్దులు చెరిపేసి.. ప్రపంచ ఖ్యాతిని పొందుతోంది. సాంకేతికతలోనే కాదూ ఆస్కార్ అవార్డులను కొల్లగొట్టి.. తన సత్తాను చాటింది. విదేశీయులు కూడా భారత్ వైపు చూపు తిప్పుకుంటున్నారు. దేశానికి గౌరవ, మర్యాదలు దక్కుతున్నాయి. అయినప్పటికీ ఇంకా కుల వివక్షతో కొట్టుకు చస్తూనే ఉన్నాం. తక్కువ కులానికి చెందిన వ్యక్తులను ప్రేమించినా, పెళ్లి చేసుకున్నా.. కనిపించని పరువు కోసం పాకులాడుతూ.. కడుపున పుట్టిన బిడ్డల్ని కాల రాస్తున్నారు కొంత మంది తల్లిదండ్రులు. పిల్లల మనుసుల్ని అర్థం చేసుకోకుండా, కేవలం కులాన్ని, మతాన్ని సాకుగా చెప్పి పగతో రగిలిపోతూ హత్యలకు ఒడిగడుతున్నారు. తాజాగా తమిళనాడులో మరో పరువు హత్య కలకలం రేపింది.
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో పరువు హత్యకు ఇద్దరు బలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణగిరి జిల్లా ఉత్తంగరి పక్కనే ఉన్న అరుణగిరి గ్రామంలో నివసిస్తోంది దండపాణి కుటుంబం. అతడికి సుభాష్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే సుభాష్ తమకున్న తక్కువ కులమైన అనుష్క అనే అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే ఒప్పుకోలేదు. దీంతో ఆ యువతిని వివాహం చేసుకుని తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన దండపాణి కొడుకు, కోడలిపై కోపం పెంచుకున్నాడు. వారిని చంపాలని నిర్ణయించుకున్నాడు.
నిద్రిస్తున్న సమయంలో మీతో మాట్లాడాలని కొడుకు ఇంటికి వచ్చిన దండపాణి.. తనతో తెచ్చుకున్న కత్తితో కొడుకు సుభాష్, కోడలిపై దాడి చేశాడు. సుభాష్ తీవ్ర గాయాలతో మరణించాడు. అయితే కోడలిపై కత్తితో దాడి చేస్తున్న సమయంలో ఇంట్లోనే ఉన్న అత్త కన్నమ్మల్ అతడిని ఆపాలని ప్రయత్నించింది. ఆమెను కూడా కత్తితో నరికి హత్య చేశాడు. ఇంతలోనే తీవ్ర గాయాల పాలైన కోడలు అనుష్క అక్కడి నుంచి పారిపోయి చెట్ల మధ్యలో దాక్కుంది. కోడల్ని చంపేందుకు వెంబడిస్తుండగా.. దండపాణిని స్థానికులు పట్టుకున్నారు. అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.