ఇంట్లో ఆడవాళ్ల మధ్య గొడవలు సహజం. వీరి పోరుతో ఇంట్లో ఉండే పురుషులు కూడా ఇబ్బందులకు గురౌతుంటారు. కొన్ని సార్లు ఈ గొడవలు తేరుకుంటాయని అనుకున్నప్పటికీ.. ఒక్కొక్కసారి పెను విపత్తుకు దారి తీసే అవకాశాలున్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఇంట్లో గొడవలు ఓ ప్రాణం తీసే వరకు చేరాయి.
ఇల్లు, సంసారం అన్నాక చిన్న చిన్న గొడవలు సహజం. అదే ఉమ్మడి కుటుంబం అయితే ఇంకాస్త ఎక్కువ. ముఖ్యంగా ఆడవాళ్ల మధ్య నెలకొన్న అపార్థాలతో నిత్యం గోలలు, గొడవలతో ఆ ఇళ్లు ప్రత్యక్ష నరకంలా కనిపిస్తుంది. అత్త, కోడలు, ఆడపడుచుల మధ్య సఖ్యత లేని కారణంగా నలిగిపోతున్న పురుషులు అనేక మంది ఉన్నారు. ఇంట్లో వారికి సర్థి చెప్పలేక.. బయటకు వెళ్లలేక సతమతమౌతుంటారు. కానీ ఒక్కొక్కసారి ఈ గొడవలే పెను విషాదాలకు దారి తీస్తాయి. అటువంటి ఘటన హైదరాబాద్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తన తల్లి చెప్పిన మాట వినడం లేదని వదినపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో వ్యక్తి. అయితే అసలు విషయమేమిటంటే..?
అత్తాపూర్ ఔట్‌పోస్ట్ ఇన్‌స్పెక్టర్ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బీదర్ భీమల్‌ఖేడ్‌కు చెందిన రషీద్‌మియా కుమార్తె షాహిన్ బేగం(27)కు రాజేంద్రనగర్ జలాల్‌బాబా నగర్‌లో ఉండే సయ్యద్ అలీతో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఓ బాబు జన్మించాడు. అయితే భర్త చార్మినార్ వద్ద ఓ వస్త్ర దుకాణంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. దీంతో అతడి ఇంటికి వచ్చేసరికి అర్థరాత్రి అవుతుంది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వదినపై మరిది సయ్యద్ పాషా కన్నేశాడు. పలు మార్లు వదినతో మరిది అసభ్యంగా తాకడం, ప్రవర్తించడం చేశాడు. దీనిపై ఆమె ప్రతిఘటిస్తూ వస్తుంది. అంతేకాకుండా అత్త కూడా అదనపు కట్నం కోసం తరచూ ఆమెను వేధిస్తుండటంతో.. ఈ విషయాన్ని తన పుట్టింటి వాళ్లకు చెప్పుకుని ఏడ్చేది.
మంగళవారం కొడుకు మొదటి పుట్టిన రోజు కావడంతో షాహిన్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో అత్త, మరిది అదనపు కట్నం కోసం ఆమెతో గొడవకు దిగారు. రాత్రి పదిన్నర సమయంలో షాహిన్ స్పృహతప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఉస్మానియాకు తరలించగా.. ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే తమకు పాషాపై అనుమానం ఉందని ఆమె తల్లిదండ్రులు మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాషాను పోలీసులు విచారించగా తన తల్లిపై తిరగబడటంతో వదినను గొంతునులిమి చంపినట్లు అంగీకరించాడు. అయితే వేరే కారణాలు కూడా ఉండవచ్చునన్న కోణంలో కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.