మద్యానికి అలవాటు పడ్డ మనిషి.. వేళా పాళా లేకుండా.. ప్రపంచంతో సంబంధం లేకుండా అందులో జోగుతుంటాడు. డబ్బుల కోసం వేధిస్తుంటాడు. మత్తులో రక్త సంబంధీకులు అని చూడకుండా అఘాయిత్యాలకు పాల్పడుతుంటాడు. మద్యం మత్తులో..
తాగుడికి బానిసలైన వ్యక్తులు కన్న తల్లిదండ్రులను, కడుపున పుట్టిన బిడ్డలను, కట్టుకున్న దాన్ని కాలరాస్తున్నారు. మద్యానికి అలవాటు పడ్డ మనిషి.. వేళా పాళా లేకుండా.. ప్రపంచంతో సంబంధం లేకుండా అందులో జోగుతుంటాడు. మద్యం డబ్బుల కోసం ఇంటిల్లిపాదినీ పీక్కు తింటాడు. ఇవ్వకపోతే వారిపై దాడులు, ఇష్టమొచ్చినట్లు కొట్టడాలు లేదంటే మత్తులో రక్త సంబంధీకులు అని చూడకుండా అఘాయిత్యాలకు పాల్పడుతుంటాడు. రోజు తాగి ఇంటికి వచ్చి తిట్టిపోయడమే కాకుండా .. పెన్షన్ డబ్బులివ్వలేదని తల్లిని కర్రతో కొట్టి చంపాడో కసాయి కొడుకు. తోడు నీడగా ఉండాల్సిన తల్లిని కాటికి పంపాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
తాగేందుకు పింఛను డబ్బులివ్వలేదని తల్లిని చంపేశాడు కర్కశ కుమారుడు. ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఎందుకంటే.. గతంతో కూడా తండ్రిని చంపేశాడు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని గంపలగూడెం మండలం చింతల నర్వ శివారు చెన్నవరం గ్రామంలో మరీదు వెంకమ్మ (70) నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కూతుర్లు.. ఒక కొడుకు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. కూలీ పనులకు వెళ్లి పిల్లల్ని పెద్ద చేసింది. కొడుకు, కూతుర్లకు పెళ్లిళ్లు చేసింది. అయితే కుమారుడు వెంకటేశ్వర్లు మాత్రం పెళ్లై, పిల్లలున్నా, తల్లిని వేధించుకు తినడం మొదలు పెట్టాడు.
పనికి వెళ్లకుండా రోజు తాగి ఇంట్లో గొడవలు పడుతుండటంతో భార్య కూడా వదిలేసి వెళ్లిపోయింది. తాగుబోతు, తిరుగుబోతుగా మారిపోవడంతో తల్లిదండ్రులు వద్దే ఉంటున్నాడు. 14 ఏళ్ల క్రితం 2006 లో తాగుడికి డబ్బులివ్వలేదని కన్న తండ్రిని కర్కశంగా కొట్టి చంపాడు. నాలుగేళ్ళు జైళ్లో కూడా ఉండి వచ్చాడు. అయినప్పటికీ తల్లి పంచన చేరాడు. తల్లి తప్పకలేక ఇంట్లోనే పెట్టుకుని కాలం నెట్టుకొస్తోంది. ఏడు పదుల వయసులో వచ్చే పెన్షన్ డబ్బులతో ఆమె బతుకుతోంది. అయితే మే ఒకటో తేదీ పింఛను వస్తుందని భావించిన కొడుకు.. వాటిని ఇవ్వాలని తల్లితో గొడవకు దిగాడు. ఇవ్వకపోవటంతో రాత్రి పదిన్నర సమయంలో కర్రతో కిరాతకంగా కొట్టి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపడుతున్నారు.