ఆడ పిల్లల విషయంలో తల్లిదండ్రుల తొందర పాటు నిర్ణయాలు వారికి గుది బండగా మారిపోతున్నాయి. చాలా వరకు ఆడ పిల్లల మనస్సు తెలుసుకుని పెళ్లిళ్లు చేయడం లేదు. దీంతో కట్టుకున్న భర్త కారణంగా ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. వారిని వ్యతిరేకిస్తే కాటికి పంపుతున్నారు.
పెళ్లీడు వచ్చిందీ కదా అని పిల్లలకు పెళ్లిళ్లు చేసేయాలని తొందరపాటులో సంబంధాలు చూసేస్తుంటారు తల్లిదండ్రులు. పిల్లల (ముఖ్యంగా ఆడ పిల్లల విషయంలో) భావాలు తెలుసుకోకుండా పెళ్లిళ్లు చేసేస్తున్నారు. అనంతరం భార్యా భర్తల మధ్య గొడవలు మొదలవుతున్నాయి. చిన్న విషయాలకే మనస్పర్థలు ఏర్పడుతున్నాయి. ఇవే అనుమానాలను తావునిస్తున్నాయి. చివరకు గొడవలకు దారి తీసి అఘాయిత్యాలకు ఒడిగట్టేలా చేస్తున్నాయి. కాళ్ల పారాణి ఆరకముందే కాటికి పంపుతున్నాడు భర్త. కేవలం అనుమానమనే పెను భూతంగా మారి ఆమె పాలిట శాపంగా మారింది. హత్యకు పురిగొల్పేలా చేసింది.
తోరణాలు ఇంకా వాడనే లేదు, పెళ్లి పందిరీ తీయనే లేదు.. కేవలం రెండు నెలలకే భార్యపై అనుమానంతో .. ఆమెపై హత్యా యత్నానికి ఒడిగట్టాడు భర్త. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల పట్టణంలోని గోపాల్ నగర్ వీధికి చెందిన మౌలాలి, కౌసర్ దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె సానియాను రెండు నెలల క్రితం అదే వీధికి చెందిన భవన కార్మికుడు కరీమ్‌తో ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లైన నాటి నుండే సానియాపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించేవాడు.
భర్త అనుమానిస్తూ.. వేధిస్తున్నాడంటూ సానియా తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వీరికి పోలీసులు సర్థి చెప్పి పంపించారు. శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేసి నిద్రపోయిన సానియాపై.. మద్యం తాగి వచ్చిన కరీమ్ దాడికి పాల్పడ్డాడు. వెంట తెచ్చుకున్న బ్లేడుతో ఆమె గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. నిద్రలోనించి ఉలిక్కి పడి లేచిన ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. వీపుపై బ్లేడుతో దాడి చేశాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో.. కరీమ్ అక్కడి నుండి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను చికిత్స ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో వైద్యులు చికిత్స చేస్తున్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.