కేపీహెచ్‌బీలో ఆత్మహత్య చేసుకున్న సాత్విక ఘటనలో పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. ఆమెది ఖచ్చితంగా సూసైడ్ చేసుకోలేదని చెబుతున్నారు. గతంలో కూడా వీరికి గొడవలు జరిగాయని తెలిపారు. వారే చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ మండిపడుతున్నారు.
భార్యా భర్తల మధ్య గొడవల కారణంగా పిల్లలు బాధితులవుతున్నారు. కుటుంబ కలహాలు కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. దీని కారణంగా దంపతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దీంతో వారికి పుట్టిన పిల్లలు తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోతున్నారు. ఆ కుటుంబ కలహాలే సాత్వికను బలితీసుకున్నాయి. ఎనిమిది నెలల చిన్నారి తల్లి లేనిదయ్యింది. భర్తతో జరిగిన గొడవ కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీకాలనీలో చోటు చేసుకుంది. అయితే ఆమె మరణంపై సాత్విక తల్లిదండ్రులు, ఆమె సోదరి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే.. విజయవాడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వెంకట హరీష్‌తో 2021లో సాత్వికకు వివాహం అయ్యింది. సాత్విక ఐసీఐసీఐ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‍గా పనిచేస్తున్నారు. హరీష్-సాత్విక దంపతులు కేపీహెచ్‌బీ ఒకటో రోడ్డు ట్రినిటీ చర్చి సమీపంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఎనిమిది నెలల బాబు ఉన్నాడు. అయితే గత కొంతకాలంగా హరీష్, సాత్వికల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 6న కూడా గొడవ జరగ్గా.. ఆవేశంతో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాసేపటికి హరీష్ వచ్చి తలుపు కొట్టగా ఎంతకు తీయలేదు. దాంతో అతడు తలుపు బద్దలు కొట్టి.. లోపలకు వెళ్లి చూడగా.. ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది సాత్విక. వెంటనే అతడు తన తల్లిదండ్రులు, అత్తమామలకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే సాత్విక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె తల్లిదండ్రులు, సోదరి ఆరోపిస్తున్నారు. ఇది హత్యేనని చెబుతున్నారు.
చివరి సారిగా ఏప్రిల్ 6న రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి.. తనను తీసుకువెళ్లిపోవాలని, పలు సార్లు ఫోన్ చేసిందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఏంటీ నన్ను కొడుతున్నావ్’అనే మాటలు వినిపించాయన్నారు. ‘డాడీ నన్ను తీసుకెళ్లిపో డాడీ అని చెబితే.. సర్ధుకుపోమ్మా అని చెప్పాం. మళ్లీ ఫోన్ చేసి డాడీ.. నేను వెళిపోతా అంది. మరోసారి అత్త ఫోన్ తీసుకుని, నేను చూసుకుంటా అని చెప్పింది. ఆ సమయంలోనే వెనుక నుండి ఏంటీ కొడతావేంటీ’అని తన కుమార్తె అరుస్తుందని తల్లి కన్నీటి పర్యంతమైంది. తన అక్క సూసైట్ చేసుకొని ఉండదని సాత్విక సోదరి చెప్పారు. ఎప్పుడూ గొడవ జరిగినా.. అక్క ఒక్కటే అనేది.. ‘నేను నా కొడుకును తెచ్చేసుకుంటాను. నాకు ఉద్యోగం ఉంది నేను పెంచుకోగలను. సూసైడ్ చేసుకునే రకమైతే మా అక్క కాదు. అక్క అంత పిరికిదీ కాదు. సూసైడ్ చేసుకోలేదు. అక్క స్టుపిడ్ అయితే కాదు’. వాళ్లే చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.