తెలంగాణ బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో విషాదం నెలకొంది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కార్యకర్తలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. బాణా సంచాలు పేల్చడంతో అపశృతి చోటుచేసుకుంది.
తెలంగాణ బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో తీవ్ర విషాదం నెలకొంది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమల పాడులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఘోర ప్రమాదం జరిగింది. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కార్యకర్తలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. బాణా సంచాలు పేల్చడంతో అపశృతి చోటుచేసుకుంది. బాణా సంచా ఎగిరి పక్కనే ఉన్న గుడిసెపై పడటంతో నిప్పులు చెలరేగాయి. అందులో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలి ఒకరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. అయితే గ్యాస్ సిలిండర్ పేలడంతో పలువురి శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. ముక్కలు ముక్కలుగా శరీర భాగాలు తెగి పడటంతో ఆ ప్రాంతం భీతావాహంగా మారింది.
కొన్ని రోజుల నుండి తెలంగాణలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పేరిట కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా.. ఖమ్మం జిల్లాలోని చీమల పాడులో ఎమ్మెల్యే రాములు నాయక్, ఎంపీ నామా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, అక్కడి ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు బాణా సంచాలు పేల్చి హంగామా సృష్టించారు. బాణా సంచాలో ఒకటి అక్కడే ఉన్న గుడిసెపై పడింది. నిప్పులు చెలరేగి గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ధాటికి ఓ వ్యక్తి మృతి చెందాడు. పలువురి శరీర అవయవాలు తెగిపడ్డాయి. తొమ్మిది మందికి పైగా గాయపడ్డారు. అందులో పోలీసులు, జర్నలిస్టులు కూడా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను హుటాహుటిన ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.