అకారణంగా నేటి యువత తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులను గర్భ శోకాన్ని మిగిలుస్తున్నారు. బంధువులను, స్నేహితులను శోక సంద్రంలో ముంచెత్తుతున్నారు. మరి కొన్ని రోజుల్లో పెళ్లి అనగా.. ఓ యువతి దారుణ నిర్ణయం తీసుకుంది.
చిన్నకారణాలకే నేటి యువత ఆవేశంగా నిర్ణయాలు తీసుకుని మరణాన్ని ఆహ్వానిస్తున్నారు. తల్లిదండ్రులు మందలించారని లేదా అడిగినంత డబ్బులు, కోరిన కోర్కెలు తీర్చలేదని, మార్కులు సరిగా రాలేదని, స్నేహితుడు తిట్టాడని, బంధువులు ఏదో అన్నారని మనస్థాపానికి గురై బలవనర్మణానికి పాల్పడుతున్నారు. లేదంటే ఇంట్లో జరిగే తగాదాలతో కలత చెంది జీవితం భారం అనుకుని మృత్యు ఒడికి చేరుతున్నారు. తాజాగా ఓ యువతి అకారణంగా బలవంతంగా ప్రాణాలను బలితీసుకుంది. కొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి..ఆ ముచ్చట చూడకుండానే తుది శ్వాస విడిచింది.
యువతి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా కరకగూడెం మండలంలోని రేగుళ్ల గ్రామానికి చెందిన జనగం మానస (20)కు అదే గ్రామానికి చెందిన చప్పిడి ప్రశాంత్ అనే యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈనెల 22న ముహర్తం ఖరారు చేశారు. పెళ్లి పత్రికలు పంపకాలు, బంధువుల హడావుడి నెలకొన్నసమయంలో ఇంట్లో తగాదాలు మొదలయ్యాయి. మానస తండ్రి పుల్లయ్య, అన్నయ్య చందు మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలోనే పెళ్లి పత్రికలను అన్నయ్య తగులబెట్టాడు. ఈ విషయంపై బుధవారం తండ్రి పుల్లయ్య కరకగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఇంట్లో గొడవలు కారణంగా మనస్థాపానికి గురైన మానస పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు కరకగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు మణుగూరు వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మానస తుది శ్వాస విడిచింది. విషయం తెలుసుకున్న కరకగూడెం పోలీస్‌లు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మణుగూరు వైద్యశాలకు తరలించారు. పెళ్లికూతురుగా ముస్తాబవ్వాల్సిన సమయంలో చావు ఒడికి చేరింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.