ప్రేమలో కోపాలు, తాపాలు కామన్. అయితే ఇద్దరి మధ్య ప్రేమ లేదని, ఆకర్షణ అని తెలుసుకున్న నాడు బ్రేకప్ చెప్పుకుంటారు. ప్రేమికుడు మోసం చేస్తున్నాడన్న, అతడి ప్రేమలో నిజాయితీ లేదని గ్రహించిన యువతి.. అతడిని దూరం పెడుతుంది
ప్రేమలో కోపాలు, తాపాలు కామన్. అయితే ఇద్దరి మధ్య ప్రేమ లేదని, ఆకర్షణ అని తెలుసుకున్న నాడు బ్రేకప్ చెప్పుకుంటారు. ప్రేమికుడు మోసం చేస్తున్నాడన్న, అతడి ప్రేమలో నిజాయితీ లేదని గ్రహించిన యువతి.. అతడిని దూరం పెడుతుంది. అయితే ఇది జీర్ణించుకోలేని ప్రియుడు.. ఆమెను నానా రకాలుగా హింస పెడుతుంటాడు. కామ్‌గా ఉంటూనే టైమ్ కోసం ఎదురు చూస్తు ఉంటాడు. చివరకు ఆమెకు మరొకరితో వివాహం జరుగుతుంటే ఓర్వలేని వ్యక్తి దారుణాలకు ఒడిగడుతుంటారు. ఇదే జరిగింది కేరళలో. కుమార్తె మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కబోతుంటే.. తండ్రిని పొట్టనబెట్టుకున్నాడు ఆమె మాజీ ప్రియుడు.
కొన్ని గంటల్లో కుమార్తె పెళ్లి.. అనగా కొందరు దుండుగులు ఇంట్లోకి దూసుకొచ్చి తండ్రిని నరికి చంపిన ఘటన తిరువనంతపురంలోని వర్కాల వడస్సేరి కోణంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. వర్కాల నివసిస్తున్న రాజు కొన్ని రోజులు గల్ఫ్ లో ఉద్యోగం చేసి.. స్వదేశానికి తిరగి వచ్చి ఆటో డ్రైవర్‌గా స్థిర పడ్డారు. అతడి పక్కింట్లో ఉండే జిష్ణు.. రాజు కుమార్తె శ్రీలక్ష్మి గతంలో ప్రేమించుకున్నారు. అయితే ఆ తర్వాత అతడితో ప్రేమ వ్యవహారాన్ని శ్రీలక్ష్మి తెగతెంపులు చేసుకుంది. భారత్ తిరిగి వచ్చిన శ్రీలక్ష్మి తండ్రి ఆమెకు పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యాడు. శివగిరి అనే వ్యక్తితో వివాహం కుదిరింది. ఇక పెళ్లి రోజు రానే వచ్చింది. తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందన్న అక్కసుతో జిష్ణు, మరో ముగ్గురితో కలిసి రాజు ఇంటిపైకి గొడవకు వెళ్లాడు.
బుధవారం ఉదయం 10.30 గంటలకు పెళ్లి జరగాల్సి ఉండగా.. అర్థరాత్రి జిష్ణు, అతడి సోదరుడు, మరో ఇద్దరు ఇంట్లోకి దూసుకెళ్లారు. అయితే తండ్రి రాజు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అర్థరాత్రి వచ్చి గొడవ చేయోద్దని, వారికి నచ్చ జెప్పేందుకు ప్రయత్నించారు. ఈ గొడవలో రాజుపై కత్తితో దాడి చేశారు. అనంతరం అక్కడ నుండి పారిపోయారు. వారిని స్థానికులు వెంబడించి, పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే రాజు మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి.. విచారిస్తున్నారు.