ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సెల్ ఫోన్ కొనివ్వలేదని, అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అటువంటి ఘటనే కరీం నగర్ లో చోటుచేసుకుంది.
మనుషుల్లో మనో భావాలు మరింత బలహీన పడుతున్నాయి. ఏ విషయంలో బాధపడాలో, ఏ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలో తెలియక చాలా మంది క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలకు పాల్పడుతున్నారు. బలవంతంగా ప్రాణాలను తీసుకుంటున్నారు. పరీక్షలు సరిగా రాయలేదని, ప్రేమించి వ్యక్తి ప్రపోజల్‌కి లేదా పెళ్లికి ఒప్పుకోలేదని, భార్యా భర్తల మధ్య ఏర్పడ్డ పొరపచ్చాల కారణంగా, తల్లిదండ్రులు తిట్టారని ఆత్మహత్యలు చేసుకున్న వారి గురించి వార్తల్లో విన్నాం. చదివాం. అలాగే సెల్ ఫోన్ ఇవ్వలేదని, అడిగిందీ కొనిపెట్టలేదని వంటి చిన్న కారణాలతో కూడా పలువురు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మహిళ చిన్న అకారణంగా ఆత్మహత్యకు పాల్పడింది.
పొరుగింటోళ్లు తిట్టారని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కదంబాపూర్ గ్రామంలో బొంకూరి శ్రీనివాస్, కూకట్ల కుమార్ కుటుంబం నివసిస్తోంది. వీరిద్దరివి ఇరుగు పొరుగు ఇళ్లు. అయితే ఓ స్థలం విషయంలో ఈ రెండు కుటుంబాల మధ్య కొన్ని రోజుల నుండి గొడవలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో పది రోజుల క్రితం బొంకూరి శ్రీనివాస్ భార్య శైలజను(30) కూకట్ల కుమార్, అతడి కుటుంబ సభ్యులు సంతోష్, రాకేశ్, విజయ్‌కుమార్ స్వరూప దుర్భాషలాడారు. తనను దూషించడంపై శైలజ మనోవేదనకు గురైంది. అప్పటి నుండి ఇంట్లో ఎవ్వరితోనూ మాట్లాడటం లేదు.
చివరకు శైలజ.. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా.. ఆమె ఉరికి వేలాడుతోంది. శైలజను కిందకు దింపి చూడగా..అప్పటికే మృతి చెందింది. ఈ ఘటనపై శైలజ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. శైలజకు ఇద్దరు పిల్లలు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కుమార్‌తో పాటు అతడి కుటుంబంలోని నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్షణికావేశంలో తీసుకుంటున్న ఈ మరణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.