ప్రేమించేంత వరకు ఒక గోల.. ప్రేమించాక మరో గోల తీరైంది నేటి ప్రేమికులదీ. ప్రేమించిన అమ్మాయి కోసం చచ్చపోతామని బెదిరిస్తుంటారు. ఒప్పుకున్నాక మరో రకమైన టార్చర్ మొదలు. ఈ తీరు నచ్చక దూరంగా ఉంటే ఆమెపై పగ పడతుంటారు. చివరకు అంతు చూసేదాకా వదలరు.
అమ్మాయి ప్రేమించకపోతే.. ప్రేమించేంత వరకు వెంట పడుతూ ప్రాణాలు తీస్తాడు అబ్బాయి . ప్రేమించాక.. తనతోనే మాట్లాడాలని, ఇతర అబ్బాయిల వైపు చూడకూడదని, ఇతరుల బైక్స్ ఎక్కకూడదని, ఈ డ్రస్, ఆ డ్రస్‌లు వేసుకోకూడదంటూ ఆంక్షల వలయంలో కూర్చొబెడుతుంటాడు. పోనీ ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటారా అంటే.. అదీ తెలియదు. ఇంతకన్నా మంచి అందెగత్తె లేదా ఆర్థికంగా బలంగా ఉన్న అమ్మాయిని పెళ్లి సంబంధం వస్తే.. పేరెంట్స్ ఒప్పుకోలేదని, డబ్బు, ఆస్తి, అంతస్తులు, ఉద్యోగం సరిగా లేదని సాకుగా చూపించి పెళ్లి చేసుకోరు. కానీ ముందు నుండే ఆమెపై పెత్తనం చెలాయిస్తుంటాడు. పెళ్లి చేసుకోమని అమ్మాయి బలవంతం చేస్తే.. ఏదైనా చెప్పి తప్పించుకుంటాడు లేదంటే ఆమెను అంతమొందించేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇటువంటి ఘటనే జార్ఖండ్‌లో చోటుచేసుకుంది.
ప్రాణంగా ప్రేమించానన్నాడు. చివరకు అతడే.. ప్రియురాలిని కడతేర్చి.. ఏమీ ఎరగన్నట్లు నాటకమాడాడు. ప్రియురాలి తల్లి గ్రహించి ఏకంగా ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. కూతురు మృతదేహంతో సిద్ధ్‌గోడా బాగున్‌హటు రోడ్ నెం-5లో నివాసం ఉంటున్న ఆమె ప్రియుడు వికాస్ దత్తా ఇంటికి ముందు నిరసన చేపట్టింది. వికాసే తన కుమార్తెను చంపి, నదిలో పడేసి.. చంపేశాడని, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాడని మృతురాలి తల్లి ఆరోపణలు చేసింది. ఆమెను నది దగ్గరకు పిలిచి, మొబైల్ లాక్కొని, ఆపై హత్య చేసి చంపేశాడంటూ పేర్కొంది. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసే వరకు శవాన్ని తీయనంటూ, అంత్యక్రియలు నిర్వహించనని మొండికేసింది.
ఇందుకు సంబంధించిన వీడియో బంధువులకు లభించడంతో అది హత్యేనని 30 గంటల పాటు ఆమె ధర్నాకు దిగింది. ఆమె ఒంటిపై గాయాల గుర్తులు ఉన్నట్లు తెలిపింది. స్థానికులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించి ఆమె వినలేదు. అప్పటికే శవాన్ని తీసుకు వచ్చి కొన్ని గంటలు గడిచిపోవడంతో పాటు దుర్వాసన కూడా వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రేమికుడు వికాస్ దత్తా, అతని తండ్రిని పోలీసులు గురువారం జైలుకు పంపారు. సాయంత్రం ఐదు గంటలకు మృతురాలి సోదరుడు, స్థానిక నాయకులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఎఫ్ఐఆర్ కాపీని, అతని తండ్రిని జైలుకు పంపిన రుజువును అందించారు. అనంతరం ప్రేమికుడి ఇంటి వద్ద ధర్నాకు దిగిన బాలిక కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తొలగించి అంత్యక్రియలు నిర్వహించారు.