ఎంతటి కష్టమొచ్చినా బిడ్డను తల్లి వదులుకోవాలని అనుకోదు. తీవ్రమైన పరిస్థితులు దారి తీస్తే తప్ప. కేవలం తన రెక్కల కష్టం మీద పుట్టిన బిడ్డకు ముద్ద కూడా పెట్టలేనని భావించిన తల్లి.. పుట్టిన పసికందును అమ్మకానికి పెట్టింది. అయితే ప్రేమను చంపుకోలేక తిరిగి అడిగేందుకు వెళ్లగా..
ప్రపంచంలో ఏతల్లికి బిడ్డ భారం కాదు. ఎంతటి కష్టమొచ్చినా బిడ్డను తల్లి వదులుకోవాలని అనుకోదు. తన కడుపు మాడ్చుకోనైనా బిడ్డను పెంచి పోషించాలనుకుంటుంది. తీవ్రమైన పరిస్థితులు దారి తీస్తే తప్ప.. పిల్లల్ని విడిచిపెట్టదు. కట్టుకున్న భర్త మోసం చేసి పరారయ్యాడు. అప్పటికే తనలో నుండి మరో జీవం పురుడు పోసుకుంది. పెంచే స్థోమత లేదూ. తన రెక్కల కష్టం మీద పుట్టిన బిడ్డకు ముద్ద కూడా పెట్టలేనని భావించిన తల్లి.. పుట్టిన పసికందును అమ్మకానికి పెట్టింది. కానీ మనస్సు చంపుకోలేక తిరిగి అడిగేందుకు వెళ్లింది. తన బిడ్డను తనకు ఇవ్వమని వేడుకుంది, ప్రాధేయ పడింది. కానీ చివరకు ఆమె ప్రాణానికే తెచ్చుకుంది. రంగారెడ్డి జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. పెంచలేక బిడ్డను అమ్ముకుంటే.. కడుపు తీపితో తిరిగి ఇచ్చేయాలని కోరిన తల్లిని హతమార్చారు కొనుగోలు చేసిన వ్యక్తులు. ఈ ఘటన షాద్ నగర్‌లోని చటాన్ పల్లి శివారులో చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన దేవకి, తన భర్తతో కలిసి పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు వచ్చింది. అయితే ఆమె గర్భం దాల్చగా.. ఓ మగబిడ్డను ప్రసవించింది. భర్త ఆమెను వదిలివెళ్లిపోవడంతో.. బిడ్డను సాకడం కష్టంగా మారింది. దీంతో తనకు తెలిసిన పురుషోత్తం అనే వ్యక్తి సాయంతో అమ్మకానికి సిద్ధపడింది. ఈ క్రమంలో రాములు, శారద దంపతులకు మగ బిడ్డ కావాలని తెలిసి వారిని కలిశారు. రాములు, శారదకు 13 ఏళ్ల కుమార్తె ఉండగా.. మగబిడ్డ మానసిక స్థిమితం లేకపోవడంతో.. మరో మగ బిడ్డను పెంచుకోవాలనుకున్నారు.
ఈ క్రమంలో దేవకీ, పురుషోత్తం వారికి ఆరు నెలల బిడ్డను లక్షా యాభై వేలకు అమ్మేసింది. అయితే బిడ్డపై ప్రేమను చంపుకోలేని దేవకీ..డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని, తన బిడ్డకు తనకు ఇవ్వాలని రాములు ఇంటికి వెళ్లి అడిగింది. ఆ దంపతులు బిడ్డను ఇచ్చేందుకు నిరాకరించారు. పలుమార్లు అడగడంతో ఆమెను మట్టుబెట్టేందుకు సిద్ధమయ్యాడు రాములు. సోమవారం రాత్రి కుమారుడ్ని అడిగేందుకు వచ్చిన దేవకీని చున్నీతో ఉరి వేసి హత్య చేశాడు రాములు, అతడి కుటుంబ సభ్యులు. మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి రోడ్డు ప్రక్కన పడేశారు. అర్థరాత్రి పెట్రోలింగ్ చేసిన పోలీసులకు అనుమానం వచ్చి చూడగా.. శవం కనిపించడంతో కేసు నమోదు చేసి 12 గంటల్లోనే చేధించారు. రాములును అరెస్ట్ చేసి విచారించగా జరిగిన హత్య విషయం పోలీసులకు తెలిపాడు. వెంటనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.