దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు పూజలు చేస్తాం. కోరిన కోరికలు తీర్చాలని మొక్కులు మొక్కుతాం. అవి తీరితే చీరలు, సారెలు రూపంలో దేవుళ్ల మొక్కులు తీర్చుకుంటాం. కానీ దేవత కలలో కనిపించి ఇలా చేసుకోమందని దారుణానికి ఒడిగట్టిందో మహిళ.
మన కోరికలు తీర్చాలని రోజు దేవుడికి దణ్ణం పెట్టుకుంటాం. పూజలు, ఫలహారాలు, ప్రసాదాలు పెట్టి కోరికల చిట్టాను విప్పుతాం. మొక్కులు మొక్కుతాం. అవి నేరవేరితే.. చీరలు, సారెలు, ఆభరణాలు సమర్పిస్తుంటాం. దేవుడిపై భక్తి ఉండొచ్చు. మూఢత్వం ఉండకూడదు. దేవుడిపై అంధ విశ్వాసంతో.. తమ భక్తిని నిరూపించుకోవాలని కొంత మంది తహతహలాడుతుంటారు. భక్తి కన్నప్పను స్ఫూర్తిగా తీసుకుని.. గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు. నాలుక కోసుకోవడం లేదా చేతి మీద హారతి కర్పూరం వెలిగించుకోవడం, ఆత్మార్పణ చేసుకోవడం వంటి చర్యలకు దిగుతారు. అలా ఓ మహిళ చేసిన పని హైదరాబాద్‌లో కలకలం రేపింది.
హైదరాబాద్ శివారు అత్తాపూర్‌లో దారుణం జరిగింది. ఓ మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించారు కొంత మంది దుండగులు అంటూ వార్తలు గుప్పుమన్నాయి. నడిరోడ్డుపైనే జరిగిన ఈ ఘటనను చూసి స్థానికులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. పిల్లర్ నెంబర్ 133 వద్ద మహిళ కాలిన గాయాలతో కనిపించింది. తీవ్రంగా గాయపడిన ఆ మహిళను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కాగా బాధితురాలు అత్తాపూర్‌లో సాయిబాబా దేవాలయం దగ్గర యాచకురాలు శివానీగా పోలీసులు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆమెకు మానసిక పరిస్థితి సరిగా లేదని, ఒక పాప కూడా ఉందని, భర్తకు దూరంగా ఉంటోందని పోలీసులు కనుగొన్నారు. ప్రస్తుతం ఆమె ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. భర్తే ఈ పని చేశాడని తొలుత అంతా భావించారు. కానీ ప్రాథమిక విచారణలో.. దుర్గాదేవి తనకు కలలో కనిపించి, ఆత్మార్పణ చేసుకోమన్నట్లు చెప్పిందని.. బాధితురాలు శివానీ వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆ మహిళ ఇంత దారుణానికి ఒడిగట్టున్నట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు మరింత విచారణ చేపడుతున్నారు. మరిన్ని విషయాలు వెల్లడిస్తామని తెలిపారు.