ఇప్పటి వరకు అమెరికాలో రాజ్యమేలుతున్న తుపాకీ సంస్కృతి, ఇప్పుడు భారత్‌కు చేరింది. మంగళవారం అర్ధరాత్రి తెలంగాణ రాజధాని నగరంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనతో నగరాన్ని ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేసింది.
అమెరికాలో విశృంఖలంగా మారిన గన్ కల్చర్ ఇప్పుడు భారత్‌కు పాకింది. భారత్‌లో లైసెన్సు లేకుండా తుపాకీ కలిగి ఉండటం, వినియోగించడం చట్ట విరుద్ధమైన నేరం. అయితే అక్రమ మార్గాల్లో ఆయుధాలు దేశానికి వచ్చి చేరుతున్నాయి. ఉగ్రవాదులు, గ్యాంగస్టర్స్, స్మగ్లర్స్ వద్దకు చేరుతున్నాయి. అక్రమ విక్రయాల ద్వారా యువత చేతికి కూడా ఆయుధాలు చిక్కుతున్నాయి. సినిమా ప్రభావమో లేదా సమాజం, పరిస్థితుల ప్రమేయమే తెలియదని కానీ యువత చేతికి చిక్కిన గన్ ఫైర్ అవుతుంది. తాజాగా హైదరాబాద్‌లో అర్థరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టప్పాచబ్రుతా ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి ఆకాష్ సింగ్ (26) అలియాస్ చోటు అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆకాష్ అక్కడిక్కడే మరణించారు. మృతుడు బీజెపీ నేత అమర్ సింగ్ అల్లుడని సమాచారం. కార్వాన్‌లోని షబాబ్ హోటల్ సమీపంలోని తోప్‌ఖానాలో దుండగులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు. పాయింట్ బ్లాక్ రేంజ్‌లో ఫైర్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో క్రాంతి అనే వ్యక్తి దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. పాత కక్షల కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిలో గన్‌తో పాటు కత్తులు దొరికినట్లు చెబుతున్నారు.
కాగా, నిందితులు క్రాంతి, చంద్రజోషి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. గతంలో ఆకాష్ సింగ్‌పై అతని బంధువు క్రాంతి దాడి చేశాడు. దీంతో అతడిపై ఫిర్యాదు చేయడంతో క్రాంతి జైలు కెళ్లాడు. ఆకాష్‌పై కక్ష గట్టిన క్రాంతి జైలు నుండి బయటకు వచ్చాక అతడిని చంపాలని పథకం వేసుకున్నాడు. 2 నెలల క్రిందట బీహార్ నుండి గన్ తెచ్చుకున్న క్రాంతి సమయం కోసం వేచి చూశాడు. మంగళవారం రాత్రి, ఆకాష్ సింగ్‌తో రాజీ కుదుర్చుకోవడానికి కార్వాన్‌లోని తోపేఖానా ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ అనే కామన్ ఫ్రెండ్‌ని సంప్రదించాడు. అనంతరం ఆకాష్‌ను ఇమ్రాన్ తన నివాసానికి పిలిపించగా, క్రాంతి, అతని సహచరులు కూడా అక్కడికి చేరుకున్నారు. రాజీ సాకుతో, క్రాంతి అకస్మాత్తుగా ఆయుధాన్ని తీసి ఆకాష్ పై పలు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో అతడు అక్కడిక్కడే మరణించాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితులున్నారు.