తెలంగాణ చిన్నపాటి వర్షాలకే రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు చేరిపోతున్నాయి. గుంతలు, నాలాలు, మ్యాన్ హోల్స్ వణికిస్తున్నాయి. ఇళ్లు మునిగిపోతున్నాయి, కార్లు, వాహనాలు ఈ వరద ధాటికి కొట్టుకుపోతున్నాయి. తాజాగా మౌనిక అనే బాలిక నాలాలో పడి చనిపోయిన సంగతి విదితమే.. తాజాగా మరో విషాదం నెలకొంది.
తెలంగాణలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. కాలం కాని కాలంలో వర్షాలు పడుతుండటంతో అయోమయ స్థితిలో పడిపోయారు ప్రజలు. అయితే హైదరాబాద్‌లో వర్షాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. చిన్నపాటి వర్షాలకే రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు చేరిపోతున్నాయి. గుంతలు, నాలాలు, మ్యాన్ హోల్స్ వణికిస్తున్నాయి. ఇళ్లు మునిగిపోతున్నాయి, కార్లు, వాహనాలు ఈ వరద ధాటికి కొట్టుకుపోతున్నాయి. ఈ వానలు, వరదలు చిన్నపిల్లల ప్రాణాలను బలిగొంటున్నాయి. మొన్నటికి మొన్న సనత్ నగర్ కళాసి గూడ నాలాలో మౌనిక అనే చిన్నారి పడిపోయి మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లో మరో విషాదం నెలకొంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో విషాదం చోటుచేసుకుంది. నీటి గుంతలో పడి వివేక్ అనే ఆరేళ్ల చిన్నారి మృత్యువాత పడ్డాడు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45లో ఈ ఘటన జరిగింది. చెత్త కోసమని ఓ గొయ్యి తవ్వగా.. అందులో ఇటీవల కురిసిన వర్షాలకు నీటితో నిండిపోయింది. తల్లిదండ్రులు ఇద్దరు పనిలో ఉండగా.. ఇతర పిల్లలతో కలిసి ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారి వివేక్.. ప్రమాదవశాత్తు ఆ గోతిలో పడిపోయాడు. తనతో ఆడుకునేందుకు వచ్చిన మరో చిన్నారి పరుగున వెళ్లి తన తల్లిదండ్రులకు చెప్పగా.. అక్కడి వారు వెళ్లి తీసే సరికి అప్పటికే వివేక్ మృతి చెందాడు. కనీసం 10 అడుగుల లోతు గొయ్యి అని తెలుస్తోంది. కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపడుతున్నారు.