అమ్మాయికి ప్రపోజ్ చేయడం, ప్రేమించాలంటూ వెంటపడటం, వేధించడంతో పాటు ప్రేమను ఒప్పుకోకపోతే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు కొంత మంది ఆకతాయిలు. ఒప్పుకోకపోతే ఎంతటికైనా తెగిస్తున్నారు. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతికి నరకం చూపించాడో యువకుడు.
ప్రేమ పేరుతో ఆకతాయిలు అమ్మాయిల పట్ల విచక్షణ రహితంగా వ్యవహరిస్తున్నారు. ప్రేమించాలంటూ వెంటపడటం, వేధించడంతో పాటు ప్రేమను ఒప్పుకోకపోతే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఈ విషయం గురించి తల్లిదండ్రులకు చెబితే చదువు మాన్పించి, ఎక్కడ తమను ఇంట్లోనే కూర్చొమంటారేమోనని, అంతేకాకుండా నువ్వు చనువు ఇవ్వకుండానే నీ వెంట తిరుగుతున్నాడన్న అని ఇరుగు పొరుగు సూటి పోటీ మాటలను భరించాల్సి వస్తుందని తెలిసి.. ఎవ్వరికి చెప్పుకోవడం లేదు. ఇలా చెప్పకపోవడంతో ప్రేమికుడు ముసుగులో ఉన్న రాక్షసుడు మరింత రెచ్చిపోయి.. యువతిపై దారుణాలకు ఒడిగడుతున్నాడు. ప్రేమించలేదని ఓ యువతిని అత్యంత ఘోరంగా హింసించిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది.
తన ప్రేమను అంగీకరించలేదని కక్ష గట్టిన ఓ యువకుడు.. ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిని గదిలో బంధించి, ఆమె ఒంటిపై సలసలా కాగిన నూనె పోసిన ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెదవేగి మండలం దుగ్గిరాలలో ఉంటున్న ఇంజనీరింగ్ విద్యార్థినిని అనుదీప్ అనే యువకుడు ప్రేమించాలంటూ వెంటపడేవాడు. తన ప్రేమను అంగీకరించాలని టార్చర్ పెట్టాడు. అంగీకరించలేదని.. ఆమెను ఓ గదిలో బంధించి, ఒంటిపై వేడి నూనె పోసి చిత్రహింసలకు గురి చేశాడు. ఈ దాడిలో యువతి చేతికి, కాలిపై కాలిన గాయాలయ్యాయి. అనుదీప్ నుంచి తప్పించుకున్న యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం బాధితురాలు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.