కడుపున పుట్టిన బిడ్డల కోసం తల్లిదండ్రులు అహర్నిశలు కష్టపడుతుంటారు. వారి బంగారు భవితవ్యం కోసం కష్టాలు వచ్చినా ఓర్చుకుంటారు. అనారోగ్య సమస్యలు వచ్చినా సరిగ్గా చికిత్స పొందరు. ఇదే కారణం ఓ తండ్రికి.. అతడి కుమార్తెను దూరం చేసింది.
పిల్లలే పంచ ప్రాణాలుగా బతుకుతుంటారు తల్లిదండ్రులు. ఎన్ని కష్టాలు, ఒడిదుడుకులు వచ్చినా వాటిని ఓర్చుకుంటూ కన్నబిడ్డల బంగారు భవితవ్యానికి బాటలు వేస్తుంటారు. వారు అర్థ ఆకలితో బతుకుతూ.. పిల్లల కడుపు నింపుతారు. పిల్లలు బాగుంటే చాలని భావిస్తారు. వారి ఎదుగుదలకు తమ కన్నీళ్లు అడ్డుకూడదని సమస్యలను పంటి బిగువున భరిస్తూ ఉంటారు. అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా.. పిల్లల చదువులు, ఇతర ఖర్చులకు వస్తాయని ఆసుపత్రులకు కూడా వెళ్లరు. ఇదే ఓ తండ్రికి కుమార్తెను దూరం చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని చూడలేక తల్లడల్లిపోయిందో కూతురు. చివరకు తనువు చాలించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రాజంపేటలో కవల వెంకటేశ్వరరావు దంపతులు నివసిస్తున్నారు. వీరికో కుమార్తె, కుమారుడు ఉన్నారు. వెంకటేశ్వరరావు కూరగాయల వ్యాపారం. రోజూ రాజమండ్రి రైతు బజారుకు వెళ్లి కూరగాయలకు విక్రయిస్తూ.. ఆ సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఈ సంపాదన చాలక ఇబ్బందులకు గురౌతున్న సమయంలో అతడు అనారోగ్యానికి గురయ్యాడు. అయితే తన మందులకు అయ్యే పిల్లల ఖర్చులకు వస్తుందని భావించిన తండ్రి.. సరైన చికిత్స తీసుకోవడం లేదు. ఈ విషయంపై ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతున్న కుమార్తె సత్యనాగు (19) తండ్రిని పలుమార్లు వారించింది. ఆరోగ్యంపై శ్రద్ధపెట్టాలని, తాను చదువు మానేస్తానని చెబుతూ ఉండేది.
తన ఆరోగ్యం బాగుపడుతుందని, నువ్వు బాగా చదువుకోని మంచి ఉద్యోగం చేస్తే మన కష్టాలు గట్టెక్కుతాయంటూ కుమార్తెకు సర్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు తండ్రి. ఎన్నిసార్లు అనారోగ్య సమస్యలపై తండ్రి శద్ధ్ర చూపకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది సత్య నాగు. తాను బతికి ఉంటే.. తన తండ్రి చికిత్స తీసుకోకుండా తన చదువులకు ఖర్చు పెడతాడని భావించిన యువతి.. చివరకు తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఆమె శనివారం సాయంత్రం పురుగుల మందు తాగేసింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున మృతిచెందింది. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.శుభశేఖర్ తెలిపారు.