ఎన్నో కలలతో భర్తతో కలిసి ఏడుగులు వేస్తుంది. అత్తారింట్లో అడుగుపెడుతుంది. కానీ భర్త ఆ పాలిట శాపమైతే..ఎవ్వరికీ చెప్పుకోలేక కుమిలిపోతుంది. చివరకు తీవ్ర నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఇదే జరిగింది ఓ నవ వధువు విషయంలో..
భారీగా కట్నం ఇచ్చి, బంధువుల నడుమ, మేళ తాళాలతో కుమార్తెకు వివాహం చేస్తారు తల్లిదండ్రులు. పుట్టింటి నుండి అత్తారింటికి సారెలు ఇచ్చి సాగనంపుతారు. కాపురం సజావుగా సాగితే.. గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోతాడు తండ్రి. అదే కుమార్తె కంటి వెంట నీరు కానొచ్చిందా.. ఆందోళన చెందుతాడు. వధువు కూడా ఎన్నో కలలతో భర్తతో కలిసి ఏడుగులు వేస్తుంది. కానీ భర్త ఆ పాలిట శాపమైతే..ఎవ్వరికీ చెప్పుకోలేక కుమిలిపోతుంది. చివరకు తీవ్ర నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఇదే జరిగింది ఓ నవ వధువు విషయంలో. నిండా 15 రోజులు కూడా కాలేదు పెళ్లి జరిగి..కానీ అంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోయింది.
కాళ్ల పారాణి ఆరలేదు. తోరణాలు ఇంకా వాడనే లేదు. అత్తగారింటి వెళ్లిన నవ వధువు.. పుట్టింటికి వచ్చి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే చింతల్‌లోని బాపు నగర్‌కు చెందిన నిషితకు.. మేడ్చల్ మండలం డబీర్ పురా గ్రామానికి చెందిన సంతోష్ రెడ్డితో 15 రోజుల క్రితం వివాహం జరిగింది. పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లిన నిషిత.. ఇటీవల పుట్టింటికి వచ్చింది. అయితే ఏమోందో తెలియదు కానీ.. పుట్టింట్లో విగత జీవిగా మారిపోయింది. ఆమె ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ తిన్నారు తల్లిదండ్రులు.
అంగరంగ వైభవంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే.. పుట్టింటికి తిరిగి వచ్చిన కొన్ని గంటలకే కుమార్తె బలవన్మరణానికి పాల్పడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఆమె ఆత్మహత్యపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్త వేధింపుల కారణంగా తన కుమార్తె నిషిత బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిషిత తండ్రి నరసింహారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నార. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.