డబ్బులు కావాలంటూ పిల్లల్నో, పెద్దల్నో అపహరించడం గురించి తెలుసు. లేదంటే అక్రమ సంబంధాల విషయంలో కూడా కిడ్నాప్ ఘటనల గురించి కథనాలు చదివాం. కానీ అకారణంగా ఓ వ్యక్తిని కిడ్నాప్ చేయడం గురించి తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది.
ఆస్తి, అంతస్థుల విషయంలో కిడ్నాపులు జరిగిన ఘటనలు చూశాం. అదేవిధంగా డబ్బులు కావాలంటూ పిల్లల్నో, పెద్దల్నో అపహరించడం గురించి తెలుసు. లేదంటే అక్రమ సంబంధాల విషయంలో కూడా కిడ్నాప్ ఘటనల గురించి కథనాలు చదివాం. కానీ అకారణంగా ఓ వ్యక్తిని కిడ్నాప్ చేయడం గురించి తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది. అంతేకాదూ.. అనవసర విషయాలకు కటకటాల పాలయ్యారు. చిన్న వస్తువు కోసం బిర్యానీ వ్యాపారిని అపహరించి.. వార్తల్లో నిలిచారు. బిర్యానీ కోసం కిడ్నాప్ చేశారనుకుంటున్నారా? అబ్బే కాదండి. బిర్యానీ కోసం చేసినా ఓ మాదిరి నేరంగా పరిగణించవచ్చు. ఇంతకు వారు అడిగిన అప్పు ఏంటే తెలుసా కోడిగుడ్డు. మరీ కోడి గుడ్డు కోసం కిడ్నాప్ చేశారంటేనే నవ్వొస్తుంది. కోడిగుడ్ల కోసం కిడ్నాప్ ఏంటండీ. పోలీసులకు ఎంత శ్రమ? పోలీస్ జీపుకు డీజిల్ ఖర్చు దండగ. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? అంటే ఇదిగో వీళ్ళే లైవ్ ఎగ్జాంపుల్.
ఈ వింత ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బిలాస్‌పూర్ జిల్లా బిల్హా పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్తోరి గ్రామంలో యోగేశ్ వర్మ అనే వ్యక్తి బిర్యానీ సెంటర్ నడుపుతున్నాడు. ఈ నెల 20న యోగేశ్ వర్మ బిర్యానీ సెంటర్ వద్దకు పక్కనే ఉన్న కొహ్రాడా గ్రామానికి చెందిన దీపక్ చతుర్వేదీ, రాహుల్ కుమార్ భాస్కర్, పరమేశ్వర్ భరద్వాజ్ అనే ముగ్గురు యువకులు వచ్చి, కోడిగుడ్లు అప్పుగా ఇవ్వమని అడిగారు. అప్పు ఇవ్వనని యోగేశ్ చెప్పారు. దీంతో అతడితో వాదనలకు దిగారు. అక్కడి నుండి వెళ్లిపోవాలని చెప్పడంతో వారు ముగ్గురు అతడిపై ఆగ్రహాన్ని పెంచుకున్నారు.అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు కారులో వచ్చి యోగేశ్ వర్మను కిడ్నాప్ చేశారు.
తమ వాహనంలో ఓ నది ఒడ్డున ఉన్న ముక్తిధామ్ అనే ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ యోగేశ్‌ను తిడుతూ.. తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనపై కుటుంబసభ్యులిచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టి.. కొన్ని గంటల్లోనే వారిని పట్టుకున్నారు. బాధితుడిని వారి బారి నుంచి కాపాడి, కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి వాహనాన్ని సీజ్ చేశారు. పలు సెక్షన్ల కింద వారిపై కేసు నమోదుచేశారు. అయితే, ఈ తరహా ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో చికెన్ అప్పు ఇవ్వలేదని కోపోద్రిక్తుడైన ఓ వ్యక్తి దుకాణ యజమానిపై దాడికి పాల్పడ్డాడు.