పోలీసులు కళ్లు గప్పి క్రికెట్ బెట్టింగ్ కాస్తున్నారా..? అయితే జాగ్రత్త. అలాంటి వారిని పోలీసులను తమదైన టెక్నాలజీ సాయంతో పట్టేసుకుంటున్నారు. ఇలానే ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. అతన్ని విచారిస్తే వంద కోట్ల రూపాయలు పోగొట్టుకున్నట్లు బయటపడింది.
దేశంలో ఐపీఎల్ 2023 సందడి ఏ రేంజులో ఉందో అందరికీ విదితమే. మ్యాచులు ఆఖరి ఓవర్ వరకు సాగుతూ అభిమానులను అసలు మజాను పంచుతున్నాయి. ఈ వినోదం పక్కనపెడితే.. తెలుగు రాష్ట్రాలలో క్రికెట్ బెట్టింగ్ కలకలం రేపుతోంది. గతంలో క్రికెట్ చూస్తూ ఆటగాళ్లను అనుకరిస్తూ మైదానంలో క్రికెట్ ఆడే యువత.. ఇప్పుడు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. మైదానంలో ఆడాల్సిన క్రికెట్‌కు పుల్‌స్టాప్ పెట్టి.. అరచేతిలో ఉన్న ఫోన్ పట్టుకొని బెట్టింగ్ అనే మహమ్మారిని తమ జీవీతంలోకి ఆహ్వానిస్తున్నారు. అలానే ఓ వ్యక్తి బెట్టింగ్ మోజులో ఏకంగా100 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. సదరు వ్యక్తి హైదరాబాదీ కావడం గమనార్హం.
హైదరాబాద్‌కు చెందిన అశోక్‌రెడ్డి అనే వ్యక్తి బెట్టింగ్‌లకు అలవాటుపడి గత 12 ఏళ్లలో ఏకంగా రూ.100 కోట్లు పోగొట్టుకున్నాడు. సరదాగా మొదలైన బెట్టింగ్.. ఆ తర్వాత వ్యసనంగా మారి ఇంత మొత్తంలో డబ్బును కోల్పోయాడు. క్రికెట్ బెట్టింగ్ కేసులో అరెస్టయిన అతను ఈ విషయాన్ని స్వయంగా పోలీసులకు తెలిపాడు. నగరంలో పెద్ద ఎత్తున బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు సబ్ బుకీలు, ఒక కలెక్షన్ ఏజెంటును ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వనస్థలిపురంలో నివాసముండే అశోక్ రెడ్డి గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. దీంతో అతడు కొద్దికాలంలోనే భారీగా సంపాదించాడు. తొలుత సరదాగా క్రికెట్ బెట్టింగ్ కాసేవాడు. ఒక్కోసారి రూ.లక్షల్లో రావడంతో దాన్ని రెట్టింపు చేసేందుకు మళ్లీ మళ్లీ పందెం కాసేవాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకు బెట్టింగ్ అతనికి వ్యసనంగా మారిపోయింది. డబ్బు పోతున్నా తీరు మార్చుకోలేదు. వ్యాపారంలో సంపాదించిన డబ్బుతోపాటు ఉన్న స్థలాలన్నీ అమ్మేశాడు. అంతటితో ఆగకుండా తెలిసిన వ్యక్తులు, బంధువుల నుంచి కూడా అప్పు తీసుకొని మరి క్రికెట్ బెట్టింగ్ కాశాడు. ఇలా గత 12 ఏళ్లలో సుమారు రూ.100 కోట్ల వరకూ డబ్బు పోగొట్టుకున్నట్లు పోలీసులకు తెలిపాడు.
ఆ నష్టాలను పూడ్చుకోవడానికి అశోక్ రెడ్డి కొత్తగా క్రికెట్ బుకీ అవతార మెత్తాడు. అతనికి బండ్లగూడలో నివాసముంటున్న ఏడుకుళ్ల జగదీష్ (స్వస్థలం మిర్యాలగూడ)తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో అతడు తనకు ఇదివరకే పరిచయం ఉన్న ప్రధాన బుకీలైన ఏపీకి చెందిన పలాస శ్రీనివాసరావు, మైలబాతుల సురేష్ అలియాస్ శివ, హర్యానా చెందిన విపుల్ మోంగాలను జగదీష్ కు పరిచయం చేశాడు. అందరూ కలిసి బెట్టింగ్ నిర్వహించడం మొదలుపెట్టారు. నగరంలో ఆ డబ్బులు రాబట్టడానికి ఐటీ ఉద్యోగి అయిన వొడుపు చరణ్‌ను కలెక్షన్ ఏజెంట్‌గా నియమించుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం కేకేఆర్-ఎస్ఆర్ హెచ్ మ్యాచ్ జరగగా, వీరు బెట్టింగ్ నిర్వహించారు.
ఈ క్రమంలోనే నగదు వసూలు చేసేందుకు వెళ్తుండగా, ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు వీరిని పట్టుకున్నారు. అశోక్, జగదీష్, చరణ్‌లు పోలీసులకు పట్టుబడగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. నిందితులకు చెందిన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్‌బీఐ ఖాతాలలోని రూ.3 కోట్ల లావాదేవీలను సీజ్ చేశారు. అలాగే వీరి వద్ద నుంచి ఒక కారు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వీరు ‘నేషనల్ ఎక్స్‌ఛేంజ్9’ అనే ఆన్ లైన్ పోర్టల్ ద్వారా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.