ప్రేమికుల దినోత్సవం అంటే లవర్స్ కి పండగ లాంటిది. ఆరోజు వచ్చిందంటే పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ క్రమంలో ఆరోజున సరదాగా బయటకు వెళ్లడం, సినిమాకో, షికారుకో వెళ్లడం చేస్తుంటారు. కొంతమంది అయితే బీచ్ లకి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఒక జంట ప్రేమికుల దినోత్సవాన్ని రొమాంటిక్ గా జరుపుకుందామని గోవా బీచ్ కు వెళ్ళింది. అంతలోనే ఊహించని ట్విస్ట్ ఎదురైంది.
వేలంటైన్స్ డే ఒక జంటను పొట్టన పెట్టుకుంది. లవర్స్ డే జరుపుకుందామని బీచ్ కి వెళ్లిన జంటను తిరిగిరాని లోకాలకు పంపింది. విబు శర్మ (27), సుప్రియ దుబే (26) ఇద్దరూ ఉత్తరప్రదేశ్ కి చెందిన వారు. విబు శర్మ , ముంబైకి చెందిన ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి కాగా.. సుప్రియ బెంగళూరుకి చెందిన కంపెనీలో ఉద్యోగం చేసేది. అయితే వాలంటైన్స్ డే సందర్భంగా ఇద్దరూ గోవా బీచ్ కు వెళ్లారు. అక్కడ బీచ్ దగ్గర ఉన్న అరేబియన్ సముద్రంలో సరదాగా గడిపారు. చాలా సంతోషంగా ప్రేమికుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఊహించని విషాదం వారి జీవితాన్ని ముంచేసింది. సముద్రంలోకి వెళ్లిన జంట సముద్రంలోనే మునిగిపోయారు.
విబు, సుప్రియ దంపతులు గోవా వెళ్లినట్టు ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలియదు. వాళ్ళు ఇంట్లో చెప్పకుండా గోవా బీచ్ కి వెళ్లారు. సోమవారం రాత్రి భోజనం తర్వాత దక్షిణ గోవా జిల్లా కెనకోనా తాలూకా పలోలెం బీచ్ దగ్గర ఉన్న అరేబియన్ సముద్రంలో కాసేపు ఈత కొట్టారు. ఔరం స్ట్రెచ్ బీచ్ వద్ద వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు సమయాల్లో కొట్టుకుపోయినట్లు పోలీసులు తెలిపారు. సుప్రియ మృతదేహాన్ని మంగళవారం ఉదయం 7 గంటలకు ఔరం వద్ద కనుగొనగా.. విబు శర్మ మృతదేహాన్ని ఔరం సమీపంలో మధ్యాహ్న సమయంలో కనుగొన్నట్లు కెనకోనా పోలీస్ స్టేషన్ లో పని చేసే సీనియర్ అధికారి వెల్లడించారు.
సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. బృందంగా ఏర్పడి సంఘటన స్థలం వద్దకు చేరుకున్నారు. లైఫ్ గార్డ్స్ సహాయంతో మృతదేహాలను బీచ్ ఒడ్డుకు తీసుకొచ్చారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం సుప్రియ, విబు ఇద్దరూ బంధువులని.. ఇంట్లో చెప్పకుండా గత కొన్ని రోజుల క్రితం నుంచే గోవా వెకేషన్ లో ఉన్నారు. వారి మొబైల్ ఫోన్ దొరికేవరకూ ఆ మృతదేహాలు వారివే అన్న విషయాన్ని గుర్తుపట్టలేకపోయామని పోలీసులు తెలిపారు. వేలిముద్ర ద్వారా ఫోన్ అన్ లాక్ చేసిన తర్వాత వాళ్ళని విబు, సుప్రియలుగా గుర్తుపట్టమని పోలీసులు వెల్లడించారు. సుప్రియ సముద్రంలో మునిగిపోతుంటే కాపాడే ప్రయత్నంలో విబు మునిగిపోయి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.
స్థానికుల సమాచారం మేరకు.. సుప్రియ ఫోన్ లో ఉన్న సమాచారం ద్వారా రిసార్ట్ సమీపంలో ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. రిసార్ట్ హోటల్ సిబ్బంది ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం.. ఇద్దరూ హోటల్ కి వచ్చినట్టు రికార్డ్ అయ్యింది. ఇద్దరూ కలిసి విషాదం ముందు రాత్రి డిన్నర్ చేసి.. డ్రింక్ లు సేవించి.. ఆ తర్వాత సముద్రంలోకి ఈత కొట్టడానికి వెళ్లారని సిబ్బంది చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మరణాలపై ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులు తేల్చారు. ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి వచ్చి ఉండవచ్చు లేదా సరదాగా కొన్ని రోజులు గడపడానికి వచ్చి ఉండవచ్చునని భవిస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.