దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన శ్రద్దా వాకర్ హత్య కేసును ఢిల్లీ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేసుకు సంబంధించి దర్యాప్తును పరుగులు పెట్టిస్తున్నారు. నిందితుడు అఫ్తాద్‌ను విచారిస్తున్నారు. విచారణలో పలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. శ్రద్ధా 35 శరీర భాగాలను ఎక్కడ పడేశాడన్న దానిపై కూడా విచారణ చేపట్టారు. కేసులో కీలకమైన ఆమె తల కోసం పోలీసులు చాలా కష్టపడుతున్నారు. అఫ్తాద్ ఆమె తలను ఢిల్లీలోని ఓ చెరువులో పడేసినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు ఆమె తల కోసం చెరువులో గాలిస్తున్నారు.
ఇందుకోసం ఏకంగా ఆ చెరువునే తోడేసే పనిలో పడ్డారు. చెరువును తోడటానికి మున్సిపల్ అధికారుల సహాయం కూడా తీసుకుంటున్నారు. అయితే, పోలీసుల ప్రయత్నాలు ఫలించటానికి చాలా సమయం పట్టేలా ఉంది. అసలు చెరువులో శ్రద్ధా తల ఉందా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకమే. కాగా, మహారాష్ట్రకు చెందిన అఫ్తాద్, శ్రద్ధా వాకర్ ఒకే కాల్ సెంటర్‌లో పని చేసేవారు. మొదట్లో వీరిద్దరికీ పెద్దగా పరిచయం ఉండేది కాదు. 2018లో ఓ డేటింగ్ సైట్ ద్వారా శ్రద్ధాతో అఫ్తాద్ క్లోజ్ అయ్యాడు. ఇద్దరి పరిచయం ప్రేమకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే వీరి ప్రేమ విషయం శ్రద్ధా కుటుంబసభ్యులకు తెలిసింది.
వాళ్లు దీన్ని ఒప్పుకోలేదు. దీంతో కుటుంబసభ్యుల ఒత్తిడి తట్టుకోలేక శ్రద్ధా, అఫ్తాద్ ఢిల్లీకి వెళ్లిపోయారు. ఒకే ఇంట్లో ఉంటూ తమ పనులు చేసుకునేవారు. ఆమె మరణానికి కొన్ని నెలల ముందు నుంచి పెళ్లి విషయంలో అఫ్తాద్‌పై ఆమె ఒత్తిడి తేసాగింది. ఈ విషయంలోనే ఇద్దరికీ గొడవలు జరిగేవి. ఇది భరించలేకపోయిన అతడు ఆమెను చంపాలని డిసైడ్ అయ్యాడు. మే నెలలో ఆమెను హత్య చేశాడు. శవాన్ని 35 ముక్కలు చేసి 18 రోజుల్లో అక్కడక్కడా పడేశాడు. ప్రస్తుతం పోలీసులు ఆ ముక్కల కోసమే అన్వేషిస్తున్నారు. కొన్ని ఎముకల్ని స్వాధీనం చేసుకున్నారు.