మహాలక్ష్మి డిగ్రీ చదువుతోంది. ఆమె తల్లి ప్లాస్టిక్ వస్తువులు అమ్మి కుటుంబాన్ని పోషిస్తోంది. ఓ రోజు మహాలక్ష్మి ఆన్‌లైన్‌లో ఓ యాడ్ చూసింది. ఆ యాడే ఆమె జీవితాన్ని సర్వనాశం చేసింది..
ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ మోసాలు బాగా ఎక్కువయిపోయాయి. టెక్నాలజీ గురించి సరైన అవగాహన లేని అమాయకులను తమ టార్గెట్‌గా చేసుకుని పంజా విసురుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఆన్‌లైన్ మోసాల కారణంగా నిత్యం ఎంతో మంది వేలు, లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. అంతేకాదు! ఆన్‌లైన్ మోసాల కారణంగా ప్రాణాలు తీసుకున్న వారు కూడా ఉన్నారు. తాజాగా, ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం బారిన పడిన ఓ కాలేజ్ యువతి ఆత్మహత్య చేసుకుంది. తల్లి కూడబెట్టిన డబ్బులు పోవటంతో ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
తమిళనాడులోని చెన్నైకు చెందిన 19 ఏళ్ల మహాలక్ష్మి డిగ్రీ చదువుతోంది. ఆమె తల్లి తన భర్తతో వేరుపడింది. మహాలక్ష్మితో కలిసి ఉంటోంది. మహాలక్ష్మి తల్లి ప్లాస్టిక్ వస్తువులు అమ్మి కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే, ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుటుంబం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటోంది. కుటుంబ కష్టాలు చూసిన మహాలక్ష్మి.. ఏదైనా పనిలో చేరి తల్లికి అండగా నిలవాలని అనుకుంది. అలాంటి సమయంలో మహాలక్ష్మి ఓ ఆన్‌లైన్ యాడ్ చూసింది. 15 నుంచి 20 నిమిషాలు ట్రేడింగ్ చేస్తే రెట్టింపు ఆదాయం అని అందులో ఉంది. తన కుటుంబ సమస్యలు తీర్చడానికి ఇదొక్కటే మార్గం అనుకున్న ఆమె దాదాపు 30 వేలు ఆ ట్రేడింగ్ బిజినెస్‌లో ఉంచింది.
రాత్రికి రాత్రి స్టాక్స్ రూపంలో 60 వేల రూపాయలు సంపాదించింది. వాటిని అమ్మటానికి ప్రయత్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె తన 30 వేల రూపాయలు పోగొట్టుకుంది. మహాలక్ష్మి ఈ విషయాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో తల్లి ఆమెను తీవ్రంగా మందలించింది. తల్లి తిట్టడంతో మహాలక్ష్మి మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేనపుడు ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె శవాన్ని గుర్తించిన తల్లి విలవిల్లాడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.