బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న యువతి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. చక్రవర్తి అనే యువకుడు దుర్గా ప్రశాంతిని అనే యువతిని దారుణంగా హత్య చేశాడు.
చిత్తూరు జిల్లాలో చోటుచేసుకున్న బ్యూటీ పార్లర్ యువతి హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఫేస్‌బుక్ పరిచయం యువతి ప్రాణాలు తీసింది. ప్రేమ పేరుతో ఓ యువకుడు ఆమె వెంటపడటమే కాకుండా.. తిరస్కరించిందన్న కోపంతో ఆమెను హత్య చేశాడు. ఆమె నిర్వహిస్తున్న బ్యూటీ పార్లర్‌కు వెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. తాను కూడా ఆత్మహత్యకు యత్నించాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
చిత్తూరు నగరానికి చెందిన నాగరాజు, ఇందిరలు భార్యా భర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. రెండో కుమార్తె దుర్గా ప్రశాంతి ఎంఫార్మసీ పూర్తి చేసి చిత్తూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో కొన్ని రోజులు పని చేసింది. తర్వాత బ్యూటీ పార్లర్ కోర్సు నేర్చుకుని సొంతంగా బ్యూటీ పార్లర్ పెట్టింది. గత నాలుగు నెలలుగా కొండమిట్ట ప్రాంతంలో సొంతంగా బ్యూటీ పార్లర్ షాపు నిర్వహిస్తోంది. ఎంతో సాఫీగా సాగుతున్న దుర్గా ప్రశాంతి జీవితంలోకి చక్రవర్తి ఎంటర్ అయ్యాడు. ఫేస్‌బుక్ ద్వారా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. దుబాయ్‌నుంచి వచ్చిన చక్రవర్తి చిత్తూరులోని దర్గా కూడలిలో బ్రెడ్ ఆమ్లెట్ దుకాణం పెట్టి జీవిస్తున్నాడు. చక్రవర్తి తల్లికి, దుర్గా ప్రశాంతి తల్లికి కూడా స్నేహం ఏర్పడింది. దుర్గా, చక్రవర్తిలు రెండు రోజుల క్రితం కాణిపాకం ఆలయానికి వెళ్లి వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం ఏమైందో ఏమో చక్రవర్తి, దుర్గను హత్య చేశాడు.
ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన నాటి నుంచి చక్రవర్తి.. దుర్గా ప్రశాంతిని ప్రేమిస్తున్నట్లుగా తెలుస్తోంది. తన ప్రేమ విషయాన్ని కొద్ది రోజులక్రితం ఆమెకు చెప్పినట్లు సమాచారం. చక్రవర్తి ప్రేమను ఆమె ఒప్పుకోలేదట. ఈ నేపథ్యంలోనే.. ఇద్దరి మధ్యా నివురు గప్పిన నిప్పులా వ్యవహరం హాట్‌హాట్‌గా మారింది. మంగళవారం మధ్యాహ్నం చక్రవర్తి.. దుర్గ బ్యూటీ పార్లర్ దగ్గరకు వచ్చాడు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఇద్దరూ లోపల ఉన్న గదిలోకి వెళ్లారు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో దుర్గ తల్లి ఇందిర బ్యూటీ పార్లర్ దగ్గరకు వచ్చింది.
గది తలుపులు తెరిచి చూడగా.. దుర్గా ప్రశాంతి రక్తపు మడుగులో పడి ఉంది. చక్రవర్తి కొన ఊపరితో ఉన్నాడు. దీంతో ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దర్నీ ఆసుపత్రికి తరలించారు. దుర్గ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చక్రవర్తికి చికిత్స అందిస్తున్నారు. పోలీసుల విచారణలో చక్రవర్తి నేరం ఒప్పుకున్నాడు. హత్య తానే చేసినట్లు పోలీసులకు చెప్పాడు. గదిలో ఆ నాలుగు గంటల ఏం జరిగిందన్న దానిపై పోలీసులు విచారిస్తున్నారు.