వాళ్లిద్దరికి ఒకరంటే మరొకరికి చచ్చేంత ఇష్టం. ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఎన్నో ఆశలతో జీవితాన్ని మరోలా ఊహించుకున్నారు. పెద్దలను ఎలాగైన ఒప్పించుకుని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వారు ఊహించని విధంగా పెద్దలు వీరి పెళ్లికి నిరాకరించడంతో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అది తమిళనాడులోని వేల్లూరు జిల్లా గుడియత్తం పరిధిలోని నెల్లూరు పేట.
ఇదే గ్రామానికి చెందిన అజిత్ కుమార్(26) పాల వ్యాపారం చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక ఇదే గ్రామానికి చెందిన రీట(22) అనే యువతి టీచర్ ట్రైనింగ్ తీసుకుంటూ నెల్లూరుపేట పంచాయితి వార్డు సభ్యురాలుగా కూడా ఉంది. అయితే వీరిద్దరిది ఒకే గ్రామం కావడంతో ఇది వరకే పరిచయం ఉంది. ఈ పరిచయంతోనే వారిద్దరు కొన్నాళ్ల తర్వాత ప్రేమలో పడినట్లు సమాచారం. అలా రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. పీకల్లోతు ప్రేమలో ఉన్నవీళ్లిద్దరూ ఎలాగైన పెళ్లి చేసుకోవాలనుకున్నారట. అయితే ఇందులో భాగంగానే ముందుగా వారి తల్లిదండ్రులకు నచ్చచెప్పినా, వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో అజిత్ కుమార్ తీవ్ర మనస్థాపానికి గురైనట్లుగా తెలుస్తోంది.
కాగా ఆదివారం రాత్రి అజిత్ స్థానికంగా ఉన్న ఓ నీటి కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే రీట కూడా అర్థరాత్రి 2 గంటల సమయంలో గ్రామంలోని ఓ నీటి బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఒకే రోజు ఇద్దరు మరణించడంతో గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరు ప్రేమించుకున్నారని, పెళ్లికి ఒప్పుకోని కారణంగానే వీళ్లు బలవన్మరణానికి పాల్పడినట్లుగా స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.