కొన్ని ఘటనలు గుండెను బరువెక్కేలా చేస్తే.. మరి కొన్ని ఘటనలు గుండెలను పగిలేలా చేస్తాయి. ఇలా ఎన్నో విషాద సంఘటనలు మనిషిని అతలాకుతలం చేస్తూ ప్రాణాలు పోయేలా చేస్తాయి. సరిగ్గా ఇలాంటి ఓ స్టోరీలోనే ఓ తల్లి కొడుకు మృతదేహాం వద్ద ఏడుస్తూ తాను కూడా కన్నుమూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాద ఘటన స్థానికుల కంట కన్నీరును తెప్పిస్తుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని చంగల్ పేట. ఇదే ప్రాంతంలో నివాసం ఉంటుంది ఓ కుటుంబం. శాంతి అనే మహిళకు జై గణేష్, తరుణ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే పెద్ద కుమారుడు జై గణేష్ (15) ఇటీవల పదో తరగతిలో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఈ క్రమంలోనే శనివారం రోజున జై గణేష్ తన తమ్ముడైన తరుణ్ తో కలిసి ఆడుకుంటున్నాడు. అయితే ఉన్నట్టుండి జై గణేష్ కిందపడి పోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
వెంటనే గమనించిన అతని కుటుంబ సభ్యులు స్థానికంగా ఉండే చంగల్ పేట ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు జరిపిన వైద్యులు ఆ బాలుడు గుండె పోటుతో మరణించినట్లుగా నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం జై గణేష్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఇక కొడుకు లేడు, రాడు అన్న బాధతో తల్లి శాంతి శోక సంద్రంలో కుమారుడి మృతదేహాన్ని చూస్తూ ఏడుస్తూ ఉంది.
ఇది కూడా చదవండి: ఆమె ఇంగ్లీష్ టీచర్! ఎవ్వరికీ చెప్పకుండా విహారయాత్రకి వెళ్లి..!
కుమారుడిని ముద్దాడుతూ నా కొడుకు లేడన్న బాధను దిగమింగుకోలేక శాంతి అక్కడికక్కడే కన్ను మూసింది. దీంతో వెంటనే స్పందించిన శాంతి కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే శాంతి ప్రాణాలు విడిచింది. ఒకే రోజు తల్లీకొడుకు మరణించడంతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాజాగా చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.