డబ్బు కోసం కొందరు దేనికైన తెగిస్తున్నారు. ఎన్నో అడ్డుదారులు తొక్కుతూ ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ భర్త పెళ్ళైన రెండు నెలలకే భార్యను అదనపు కట్న కోసం వేధింపులకు గురి చేశాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్య తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంది. తాజాగా ఈ ఘటన చాంద్రాయణగుట్టలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని లాథూరు జిల్లాకు చెందిన షేక్ ఇషాఖ్ (22), సాదియా బేగం (18) ప్రేమించుకున్నారు.
ఇక పెళ్ళి కూడా చేసుకోవాలనుకుని పెద్దలను ఒప్పించి రెండు నెలల క్రితం పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత ఈ నవ దంపతులు చాంద్రాయణగుట్ట బండ్లగూడలోని జహంగీరాబాద్ లో కాపురం పెట్టారు. భర్త ఇషాఖ్ స్థానికంగా కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇక పెళ్ళైన నెలన్నరకే భర్త అసలు రూపం బయటపడింది. అదనపు కట్నం తేవాలంటూ భార్యను వేధించేవాడు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి సాదియా బేగం బాధపడుతుండేది. ఈ క్రమంలోనే భర్త వేధింపులు ఎక్కువవుతుండడంతో బార్య భరించలేకపోయింది.
ఏం చేయాలో అర్థం కాక బుధవారం రాత్రి సాదియా ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భర్త వేధింపుల కారణంగానే మా కూతురు ఆత్మహత్య చేసుకుందని సాదియా తల్లిదండ్రులు పోలీసులకు వివరించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.