ప్రేమ పెళ్లిళ్లలో ప్రేమ కనుమరుగవుతోంది. పెళ్లయిన కొత్తలో ఉన్నంత ప్రేమ తర్వాతి కాలంలో ఉండటం లేదు. భార్యాభర్తల మధ్య ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతున్నాయి. విడిపోవటమో.. ఆవేశంలో ఒకరిని ఒకరు చంపుకోవటమో లేదా ప్రాణాలు తీసుకోవటమో జరుగుతోంది. తాజాగా, భర్త వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ పెళ్లి చేసుకున్న 3 ఏళ్లకే ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా, చల్లేకెర తాలూకా, బాల్యనహళ్లికి చెందిన వినుత, కెలేగోటేకు చెందిన కిరణ్ ప్రేమించుకున్నారు.
ఆ సమయంలో వినుత ఎంఎస్సీ చదువుతుండగా.. కిరణ్ డిప్లోమా చదువుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరికీ పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోకపోవటంతో చిత్రదుర్గలోని ఓ మారెమ్మ గుడిలో వివాహం చేసుకున్నారు. తర్వాత ఎన్నో ఆశలతో వినుత దాంపత్య బంధంలోకి అడుగుపెట్టింది. కొన్ని నెలల పాటు వీరి సంసారం ఎంతో అద్భుతంగా సాగింది. వీరి ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా పుట్టింది. అయితే, గత కొన్ని నెలల క్రితం కిరణ్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. కట్నం తీసుకురమ్మని భార్యను హింసించటం మొదలుపెట్టాడు. ఓ రోజు భార్యను బాగా కొట్టి పుట్టింటికి పంపాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి, బుద్ధిగా ఉండాలని హెచ్చరించారు.
ఇక, అప్పటినుంచి భార్యను పుట్టింటికి పంపకుండా ఇంట్లోనే బాగా హింసించేవాడు. అయినా వినుత అవేమీ పట్టించుకోలేదు. గుట్టుగా కాపురం చేసుకుంటూ వచ్చింది. ఆదివారం వినుత పుట్టినరోజు. సాయంత్రం గుడికి వెళదామని అనుకుంది. ఇంతలోనే ఇంట్లోని తన గదిలో ఉరికి వేలాడుతూ కనిపించింది. తమ అల్లుడే కూతుర్ని కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని వినుత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ అల్లుడికి అన్ని చెడు వ్యసనాలు ఉన్నాయని అన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కిరణ్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.