అవినాష్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాడీవేడీగా విచారణ జరుగుతోంది. సీబీఐ తరుపు, అవినాష్‌రెడ్డి తరపు న్యాయవాదులు పోటీపోటీగా తమ వాదనలు వినిపిస్తూ ఉన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోరుతూ కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. హైకోర్టులో అవినాష్‌రెడ్డి బెయిల్‌పై వాడీవేడీగా విచారణ జరిగింది. అవినాష్‌రెడ్డికి బెయిల్ ఇవ్వాలని అవినాష్‌రెడ్డి తరపు న్యాయవాది కోర్టును కోరారు. అవినాష్‌రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని, ఈ కేసులో అవినాష్‌రెడ్డి హస్తం ఉందని సీబీఐ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే అవినాష్‌రెడ్డిని బుధవారం ఉదయం 10.30 గంటలకు విచారిస్తామని పేర్కొంది. అయితే, హైకోర్టులో ఇంకా విచారణ పూర్తవ్వలేదని అవినాష్ తరపు లాయర్ హైకోర్టుకు తెలిపారు.
దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. ‘‘ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఇక్కడే ఉండగా.. ఎవరు ప్రశ్నిస్తారు’’ అని సీబీఐ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా సీబీఐ తరపు న్యాయవాది ‘‘ రేపు ఉదయం విచారణను పూర్తి చేస్తాం’’ అని తెలిపారు. కాగా, ఉదయం సీబీఐ తరఫున న్యాయవాది కోర్టు ముందు తమ వాదనలు వినిపిస్తూ.. వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. ఇప్పటి వరకు అవినాష్ రెడ్డిని నాలుగు సార్లు విచారించినట్టుగా తెలిపారు. వివేకా హత్యకు 40 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని అన్నారు. వాటిపై విచారణ జరగాల్సి ఉందని కోర్టుకు సీబీఐ తరపు న్యాయవాది విన్నవించారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయినట్లుగా చిత్రీకరించారని సీబీఐ తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.