బస్సు రన్నింగ్‌లో ఉండగానే దోపిడీకి పాల్పడ్డారు. ఈ సంఘటన గురించి తెలిసిన జనం భయాందోళనకు గురవుతున్నారు. పట్ట పగలు ఇలా దోపిడీ చేయటం ఏంటని వాపోతున్నారు..
దేశ రాజధాని ఢిల్లీలో బస్సు హైజాక్ సంఘటన కలకలం సృష్టించింది. ఓ నలుగురు దొంగలు బస్సును హైజాక్ చేసి దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణికుల దగ్గర ఉన్న సామాన్లు, డబ్బులు ఇతర విలువైన వస్తువులను దోచుకెళ్లారు. పట్ట పగలు ఈ సంఘటన చోటుచేసుకుంది. దోపిడీ జరిగిన కొన్ని నిమిషాల్లోనే దుండగులు పట్టుబడ్డారు. ఈ సంఘటనలో బస్ డ్రైవర్‌కు కూడా భాగం ఉన్నట్లు వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
ఏప్రిల్ 7వ తేదీన ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ దగ్గర ఓ మినీ ట్రావెల్ బస్సు ఆగింది. బస్సు డ్రైవర్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న వారిని బస్సులో ఎక్కించుకున్నాడు. ఇతర రాష్ట్రాలకు చెందిన దాదాపు 16 మంది ఆ బస్సులోకి ఎక్కారు. బస్సు ఆ ప్రయాణికులతో అక్కడినుంచి దూరంగా వెళ్లింది. బస్సు ఊరికి కొంత దూరం వెళ్లగానే ముగ్గురు దుండగులు బెదిరింపులకు దిగారు. ప్రయాణికుల దగ్గర ఉన్న వస్తువులను ఇచ్చేయాలంటూ బలవంతం చేశారు.
ఇవ్వని వాళ్లను, గొడవ పెట్టుకున్న వాళ్లను కిందకు దించి మరీ కొట్టారు. బస్సులో ఉన్న వారంతా వేరు వేరు రాష్ట్రాలకు చెందిన వారు కావటంతో ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోయారు. మొత్తం 16 మందినుంచి దుండగులు వస్తువులను కాజేశారు. కొద్దిసేపటి తర్వాత బస్సు చెకింగ్‌లు నిర్వహిస్తున్న పోలీసుల కంట పడింది. లోపల ఉన్న వాళ్లు లోపల జరిగిన దోపిడీ గురించి చెప్పారు. పోలీసులు ముగ్గురు దుండగులను అరెస్ట్ చేశారు. ఈ దోపిడీలో డ్రైవర్‌కు కూడా భాగం ఉన్నట్లు తేలటంతో అతడ్ని కూడా అరెస్ట్ చేశారు. ఈ దోపిడీ గురించి తెలిసిన జనం ట్రావెల్ బస్సుల్లో ప్రయాణించటానికి భయపడుతున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.