మొన్నటి వరకు కరోనా అంటే భయపడేవాళ్లు ఇప్పుడు గుండెపోటు పేరు వినిపిస్తే చాలు భయంతో వణికిపోతున్నారు. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా గడిపిన వాళ్లు హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిపోతున్నారు.
ఇటీవల దేశంలో గుండెపోటు మరణాలు రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయి. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా కనిపించినవాళ్లు హఠాత్తుగా ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూస్తున్నారు. చిన్నా పెద్ద అనే వయసుతో సంబంధం లేకుండా వరుస గుండెపోటు మరణాలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. బస్సు నడుపుతున్న డ్రైవర్ హఠాత్తుగా గుండెపోటుతో డ్రైవింగ్ సీట్ లోనే కన్నుమూశాడు.. అది గమనించిన కండెక్టర్ సమయస్ఫూర్తితో తానే డ్రైవర్ గా మారి ప్రయాణికులను రక్షించాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కర్ణాటక రాష్ట్రం హుస్పేట్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి హూస్పేట్ కి సోమవారం రాత్రి బయలుదేరింది. బస్సు మహబూబ్ నగర్ పట్టణంలోని షాసబ్ గుట్ట కూడలి వద్దకు రాగానే.. బస్సు డ్రైవర్ యమునప్ప (58) అస్వస్థతకు గురయ్యాడు. బస్సు నడుపుతున్న సమయంలో యమునప్పకు గుండెపోటు రావడంతో డ్రైవింగ్ సీట్ లోనే కుప్పకూలిపోయాడు. దాంతో బస్సు నియంత్రణ కోల్పోయింది.. ఇది గమనించిన కండెక్టర్ బాలప్ప జోగి సమయస్ఫూర్తితో డ్రైవింగ్ సీట్ వద్దకు వెళ్లి బ్రేకులు వేసి బస్సును కంట్రోల్ చేశాడు. ప్రయాణికుల సహాయంతో యమునప్ప ఒక సీటుపై పడుకోబెట్టి కండక్టర్ బాలప్ప బస్సును నడుపుకుంటూ మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ డ్రైవర్ యమునప్ప కున్నుమూశాడు.
బస్సు నడుపుతున్న డ్రైవర్ యమునప్ప ఆరోగ్య పరిస్థితి ఆందోళనగా ఉండటంతో వేగాన్ని తగ్గించాడు.. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది.. నొప్పితో డ్రైవింగ్ సీటులోనే తలవాల్చాడు. ఆ సమయంలో కండక్టర్ సమయస్ఫూర్తి ప్రదర్శించి బస్సును నియంత్రణలోకి తీసుకు వచ్చి అందులో ప్రయాణిస్తున్న 23 మంది ప్రాణాలు కాపాడగలిగాడు. ప్రాణాలకు తెగించి కండెక్టర్ చూపించిన ధైర్యాన్ని ప్రయాణికులు మెచ్చుకున్నారు. ఆర్టీసీ అధికారులు, పోలీసులు హాస్పిటల్ కి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. తర్వాత ప్రయాణికులను వేరే బస్సుల్లో వారి గమ్యస్థానాలకు పంపించివేశారు.