దేశంలో ఈ మద్య వరుసగా గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. కారణాలు ఏవైనా సరే చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడంతో వారి కుటుంబాల్లో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వరుస గుండెపోటు మరణాలు ప్రజలను కలవరపెడుతున్నాయి.
దేశంలో మొన్నటి వరకు కరోనా అంటే భయంతో వణికిపోయిన ప్రజలు ఇప్పుడు గుండెపోటు, హార్ట్ ఎటాక్ అంటే గజ గజలాడిపోతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు కలవరపెడుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ గుండెపోటుతో మరణించిన కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అప్పటి వరకు మనతో సంతోషంగా ఉన్నవారు ఒక్కసారిగా గుండెపోటుతో కన్నుమూస్తున్నారు. ఇటీవల పెళ్లింట విషాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కూతురు పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపే సమయంలో తల్లి గుండెపోటుతో మరణించింది. ఈ విషాద సంఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
సిద్దిపేట జిల్లా బంజార గ్రామంలో జగిలి స్వరూప.. వయసు 35 సంవత్సరాలు. స్వరూపకు ముగ్గురు కూతుళ్లు.. పెద్ద కూతురు వివాహం శుక్రవారం జరిగింది. వివాహ వేడుకకు బంధుమిత్రులు వచ్చి సంతోషంగా వధూవరులను ఆశీర్వదించి వెళ్లారు. పెళ్లికి వచ్చిన బంధువులతో ఇళ్లంతా ఆనందంతో నిండిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు పెళ్లి కూతురుని శనివారం ఉదయం అత్తగారంటికి పంపేందుకు సిద్దమవుతున్నారు. ఇళ్లంతా కోలాహలంగా ఉంది. అప్పటి వరకు బంధువులతో సంతోషంగా మాట్లాడిన పెళ్లి కూతురు తల్లి స్వరూప ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయింది. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకు వెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్ తెలిపారు. దీంతో పెళ్లింట ఒక్కసారే విషాదం నిండిపోయింది.
కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించిన స్వరూప ఆమెను అత్తాగారింటికి సాగనంపేలోపు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. తల్లితో అప్పటి వరకు సంతోషంగా ఉన్న ముగ్గురు కూతుళ్లు అమ్మా అంటూ గుండెలవిసేలా రోదించారు. పెళ్లి బాజాలతో మోగిన ఆ ఇంట వెంటనే చావు డబ్బు మోగడంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. పెళ్లి కూతురుతో సహ ఇద్దరు కూతుళ్ల కన్నీరు చూసి గ్రామస్థులు సైతం శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ మద్యనే ఖమ్మం జిల్లా కూసుమంచి మండంలో కూతురు పెళ్లి తెల్లారి అనగా గుండెపోటుతో అర్జున్ రావు అనే వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. జగిత్యాల లో బందెల ఆంజనేయులు..రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ కొడుకు పెళ్లి కార్యక్రమాలు జరుగుతుండగానే గుండెపోటుతో కన్నుమూశాడు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరుసగా పెళ్లి వేడుకల్లో విషాదాలు నిండుకున్నాయి.