ఇటీవల దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. ప్రమాదాలను మాత్రం అరికట్టలేపోతున్నారు.
మృత్యువు ఏ రూపంలో ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకు మనతో ఎంతో ఆనందంగా ఉన్నవారు.. ఒక్కసారిగా మన కళ్ల ముందే చనిపోతే ఎంత బాధ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పెళ్లి సంబరాల్లో మునిగిపోయిన ఇరు కుటుంబాల్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. రోడ్డు పక్కన నిలబడి వరుడి కుటుంబం కోసం ఎదురు చూస్తున్న వధువు బంధువులపై అతి వేగంగా ఓ స్కార్పియో వాహనం దూసుకు వెళ్లింది.. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన ఒడిశాలోని గంజాం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
ఒడిషా గంజాం జిల్లాలో ఓ జంట వివాహ వేడుకకు బంధుమిత్రులు తరలి వచ్చారు. పెళ్లి పనుల్లో అంతా బిజీ బిజీగా ఉన్నారు. కొద్ది సేపట్లో వరుడు వచ్చి పిల్ల మెడలో తాలి కడతాడని అందరూ ఎంతో ఆశగా.. ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వరుడికి స్వాగతం పలికేందుకు వధువు తరుపు బంధువులు రోడ్డు పక్కన వేచి ఉన్నారు. అంతలోనే మృత్యువు తరుముకు వచ్చినట్లు ఓ స్కార్పియో అతి వేగంగా వధువు కుటుంబ సభ్యులపైకి దూసుకు వెళ్లింది.. దాంతో ముగ్గురు అక్కడిక్కడే చనిపోయారు. మరో 15 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమాచారం తెలుసుకొని ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేశారు.
ఈ ప్రమాదంలో స్వప్నరెడ్డి, సంజు రెడ్డి, భారతి రెడ్డి అనే పన్నెండేళ్ల బాలిక చనిపోయినట్లుగా పోలీసులు తెలిపారు. వీరంతా కేశవ్ నగర్ కి చెందిన వారని తెలిపారు. గోపాల్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారందరినీ MKCG మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని.. వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదం తర్వాత స్కార్పియో డ్రైవర్ అక్కడ నుంచి పారిపోగా మరో వ్యక్తిని గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతి వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణం అని తెలిపారు.
ఎంతో ఆనందంగా పెళ్లి జరగాల్సిన ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకోవడంతో అందరూ దుఖఃంలో మునిగిపోయారు. మృత్యువు స్కార్పియో రూపంలో వచ్చి అమాయకుల ప్రాణాలు కబలించిందని మృతుల బంధువులు రోదనలు మిన్నంటుతున్నాయి. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేస్తున్నా.. ఎక్కడో అక్కడ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాధచాయలు ఏర్పడ్డాయి.