భార్యభర్తల బంధం అనే కాదు.. ఏ బంధం అయినా సరే విజయవంతంగా ముందుకు సాగాలంటే.. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. ఒకరికొకరు మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి. అప్పుడే ఆ బంధం కలకలం కొనసాగుతుంది. కానీ మనది పురుషాధిక్య సమాజం కదా.. ఆడవారిని గౌరవించాలంటే.. మరీ ముఖ్యంగా భార్య మాటకు విలువ ఇవ్వాలంటే చాలా మంది మగాళ్లకు మనసు ఒప్పదు. అంత చిన్న చూపు మహిళలంటే వీరికి. ఇక భార్యకు తెలియకుండా.. పరాయి ఆడవాళ్లతో స్నేహాలు, ప్రేమ వ్యవహారాలు నడపడం చాలా గొప్పగా భావిస్తారు కొందరు మగాళ్లు. తామేదో ఘనకార్యం చేసినట్లు.. దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఇలాంటి వారి విషయంలో భార్యలు కుక్క తోక వంకరలానే వీరి బుద్ధి కూడా అంతే అనుకుని పిల్లల్ని, సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారు. మరి కొందరు మాత్రం ఇలాంటి మోసకారులతో బతకలేమని విడిపోతారు. ఈ రెండు కోవలకు చెందిన మహిళలే కాక.. మరో వర్గం వారు ఉంటారు. ఇక భర్త తమను మోసం చేశాడని తెలిస్తే తగిన రీతిలో బుద్ధి చెబుతారు. ఇదిగో ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇక భార్యభర్తల బంధంలో ప్రతి మహిళ కోరుకునేది ఒక్కటే.. భర్త ప్రేమ తనకు మాత్రమే దక్కాలని.. కలలో కూడా పరాయి మహిళ ఊసు ఎత్తకూడదని భావిస్తారు. ఈ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా తట్టుకోలేరు. ఒకవేళ దురదృష్టం కొద్ది భర్త వేరే మహిళతో సన్నిహితంగా ఉన్నాడని తెలిస్తే తట్టుకోలేరు. కొందరు తమలో తామే కుంగిపోతే.. మరికొందరు ఆడాళ్ల మాత్ర ఇదిగో ఇలాంటి దారుణ నిర్ణయాలు తీసుకుంటారు. భర్త నిద్రలో పరాయి మహిళ పేరును కలవరించడమే కాక ఐ లవ్యూ కూడా చెప్పడంతో మండిపడ్డ సదరు భార్య… అతడికి జీవితంలో కోలుకోలేని శిక్ష విధించింది. ఆ వివరాలు..
బొలీవియాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. లా పాజ్ నగరంలో నివసిస్తున్న 45 ఏళ్ల వ్యక్తి నిద్రలో ఓ మహిళను తలచుకున్నాడు. అంతేకాదు, ఆమె గురించి కలవరిస్తూ.. ఐ లవ్ యూ కూడా చెప్పేశాడు. అంతే, అప్పటికే నిద్రలేచి తన భర్త కలవరింతలను ఏకాగ్రతతో వింటున్న భార్యకు చిర్రెత్తుకొచ్చింది. అయితే అతడిని లేపి దాని గురించి నిలదీయడం.. గొడవపడటం వంటివి చేయలేదు. పైగా అతడి కలను ఏమాత్రం డిస్ట్రబ్ చేయలేదు. భర్త కలవరింతలతో నిద్ర లేచిన ఆమె సరాసరి వంటగదిలోకి వెళ్లి ఓ పాత్రలో నీటిని మరిగించింది. అవి బాగా కాగాయి అనుకున్న తర్వాత.. చాలా జాగ్రత్తగా ఆ నీటిని తీసుకొచ్చి నిద్రిస్తున్న భర్త మర్మాంగాలపై పోసింది. ఆ బాధను తట్టుకోలేక అతడు విలవిల్లాడాడు. అతడి అరుపులు విన్న స్థానికులు వారి ఇంటికి వచ్చి.. అతడి పరిస్థితిని గమనించి.. వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు అతడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో అతడి చేతులు, మర్మాంగాలకు కాలిన గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. అతడు నిద్రలో మరో స్త్రీని కలవరించడం వల్ల తనకు కోపం వచ్చిందని భార్య తెలిపింది. అయితే, ఆమె భర్తపై దాడి చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఓసారి అతడిపై మద్యం పోసి నిప్పంటించే ప్రయత్నం కూడా చేసిందట. కానీ, ఏ కారణం వల్ల ఆమె అప్పట్లో ఆగ్రహానికి గురైందనే విషయం మాత్రం తెలియరాలేదు. కానీ ఈసారి మాత్రం.. అతడు తనను మోసం చేశాడు కాబట్టే.. బుద్ధి రావడానికి ఇలా చేశానని చెప్పింది. ఈ సంఘటన గురించి తెలిసిన తర్వాత చాలామంది మహిళలు మంచి పని చేశావ్.. ఇలాంటి వంకర బుద్ధి మగాళ్లకు ఇదే సరైన గుణపాఠం అంటున్నారట. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.