దేశంలో జరిగే క్రైమ్ స్టోరీలు ఒక్కోటి ఒకోలా ఉంటాయి. కొన్ని ఘటనలు విస్తుపోయేలా ఉంటే, మరికొన్ని వెన్నులో వణుకు పుట్టించేలా ఉంటాయి. ఇవన్ని పక్కనబెడితే ఇప్పుడు మీరు ఇప్పుడు చదవబోయే ఈ క్రైమ్ స్టోరీ మాత్రం సినిమా ట్విస్ట్ లను మించి ఉంటుంది. అసలు ఏం జరిగిందనే కథలోకి వెళ్తే.. అది బిహార్ రాష్ట్రం సితామడి జిల్లా ఛౌరత్ పరిగావన్. ఇదే గ్రామానికి చెందిన శశికుమార్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అయితే ఇతనికి నేపాల్ కు చెందిన హీరాదేవి అనే మహిళతో గతంలో వివాహం జరిగింది.
పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. కట్ చేస్తే ఉన్నట్టుండి శశికుమార్ భార్య హీరాదేవి ఇంట్లో నుంచి కనిపించకుండా పోయింది. భర్తతో పాటు హీరాదేవి కుటుంబ సభ్యులు అంతా వెతికారు. హీరాదేవి ఆచూకి మాత్రం ఎక్కడా దొరకలేదు. ఈ క్రమంలోనే హీరాదేవి తల్లిదండ్రులు కొత్తరాగాన్నిఎత్తుకున్నారు. మా కూతురిని అల్లుడే చంపాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్తమామల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు… ఏం సాక్ష్యాలు చూసి అరెస్ట్ చేశారో తెలియదు కానీ, ఎట్టకేలకు భర్తను జైలుకు పంపారు.
అలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఆరు నెలల పాటు శశికుమార్ జైళ్లోనే చిప్పకూడు తింటున్నాడు. శశికుమార్ నిజంగానే తన భార్యను హత్య చేసి ఉంటాడని అందరూ నమ్మారు. కానీ కథలో ట్విస్ట్ ఏంటంటే? హీరాదేవి చనిపోలేదని, పుట్టింట్లో క్షేమంగానే ఉందని తేలింది. మతిస్థిమితం లేని కారణంగానే ఆ మహిళ ఎక్కడెక్కడో తిరిగి చివరికి పుట్టింటికి చేరిందని అక్కడి మీడియా తెలిపింది. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.