దేశంలో కామాంధుల అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అద్దం పట్టే వార్త ఇది. ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ దుండగులు ఆ తర్వాత ఆమెను హింసించి చంపారు. బాలిక అన్న కనికరం లేకుండా.. కామంతో కళ్లు మూసుకుపోయి పశువుల్లా ప్రవర్తించారు. బాలిక కళ్లను పీకేసి, నోట్లో చెక్క ముక్క దూర్చారు. అనంతరం ఆమెను నది ఒడ్డున నాలుగడుగుల గొయ్యి తీసి పూడ్చారు. ఈ భయంకరమైన సంఘటన బీహార్‌లోని బగహా ప్రాంతంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బగహాలో 6వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలిక ఈ నెల 15వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. ఆదివారం తెల్లవారుజామున కుటుంబీకులు, గ్రామస్తులు బాలికను వెతుక్కుంటూ నది దాటుతుండగా, ఆ ప్రాంతం అనుమానాస్పదంగా కనిపించడంతో తవ్వి చూశారు. లోపల బాలిక మృతదేహం బయటపడింది. మృతదేహం పూర్తి నగ్నంగా ఉంది. ఎవరో ఆ బాలిక కళ్లు పీకేసి, నోట్లో చెక్క ముక్క పెట్టి గుంతలో పూడ్చిపెట్టారు. బాలిక మొహంపై బూట్ల గుర్తులు ఉన్నట్లు గుర్తించారు. బాలిక స్కూల్ యూనిఫాం గుంత దగ్గర పడి ఉంది. పక్కనే ఉన్న చెరుకు తోటలో బాలిక చెప్పులు కూడా లభించాయి.
మొదట బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ దుండగులు ఆ తర్వాత ఆమె కళ్లను పీకేసినట్లు గుర్తించారు. ఆపై నోట్లో చెక్క ముక్క దూర్చి హింసించి చంపినట్లు తెలిపారు. అనంతరం ఆమెను నది ఒడ్డున నాలుగడుగుల గొయ్యి తీసి పూడ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. బాలికను చెరకు ఆకులతో గొంతుకోసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలికపై మొదట చెరకు తోటలో సామూహిక అత్యాచారం జరిగింది. అనంతరం ఆమెను క్రూరంగా హింసించి నది ఒడ్డున గొయ్యి తీసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. బాలిక కుటుంబ సభ్యులు గ్రామానికే చెందిన ఐదుగురు యువకులపై అనుమానం వ్యక్తం చేయగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.